హైదరాబాద్: వివాద రహితుడైన దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చిరు ఇప్పుడు మెగాస్టార్ కాదని, రాజకీయాలలోకి ప్రవేశించటంతో ఆయనకు మెగాస్టార్ హోదా పోయిందని విశ్వనాథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నారు. మాస్ సినిమాలలో నటించటంద్వారా చిరు మునపటి క్రేజ్ తెచ్చుకోవటం కష్టమని వ్యాఖ్యానించారు. 150వ సినిమాను తన మొదటి సినిమాగా భావించి చిరంజీవి మళ్ళీ మెగాస్టార్ రేంజికి ఎదగాలని సలహా ఇచ్చారు. అయితే ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయమంటూ ముగించారు.
విశ్వనాథ్ వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులు నొచ్చుకునేవిధంగా ఉన్నాయనటంలో సందేహంలేదు. వీరిద్దరికీ ఏదైనా విభేదాలున్నాయా అంటే అదికూడా లేదు. ఇటీవలకూడా పలు సందర్భాలలో ఇద్దరూ ఎదురుపడి మాట్లాడుకోవటం అందరూ చూశారు. విశ్వనాథ దర్శకత్వంలో చిరంజీవి శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. మరి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వయసు మీదపడటంవలన ఏదో మాట్లాడేసి ఉంటారని కొందరు, పాజిటివ్‌గా ఇచ్చిన సలహా అని మరికొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏది ఏమైనా, అసలే ఇటీవల అతిథి పాత్ర పోషించిన బ్రూస్లీ చిత్రం దెబ్బతినటం, 150వ చిత్రం కథ ఇంతవరకూ ఖరారు కాకపోవటంవంటి అంశాలతో తలకు బొప్పికట్టిన చిరంజీవికి విశ్వనాథ్ వ్యాఖ్యలు మరింత తలనొప్పి కలిగించేవిధంగా ఉన్నాయి.