తెలంగాణ గవర్నర్ తమిళిశైను.. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆమెను చిరంజీవి మర్యాదపూర్వకంగానే కలిసినట్లుగా చెబుతున్నారు. తన సినిమా సైరా నరసింహారెడ్డిని చూసేందుకు తమిళిశైను.. చిరంజీవి ఆహ్వానించారు. గవర్నర్ సినిమా చూసేందుకు సమయం కేటాయిస్తే.. ఆ సమయంలో ప్రత్యేక షో వేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేయనుంది. అయితే.. ఇంత వరకూ… చిరంజీవి ఇలా ప్రత్యేకంగా రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారిని కానీ.. రాజకీయ నాయకుల్ని కానీ.. కలిసి… తన సినిమా చూడాలని ఆహ్వానించలేదు. ప్రత్యేకంగా తెలంగాణ గవర్నర్ ను ఆహ్వానించడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవికి – బీజేపీకి లింక్ పెట్టి కొద్ది రోజులుగా… రాజకీయ ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో.. రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా కథను.. తన తర్వాతి సినిమాకు చిరంజీవి ఎంచుకున్నారని చెబుతున్నారు. మలయాళంలో హిట్ అయిన మోహన్ లాల్ సినిమా లూసిఫర్ సినిమా రైట్స్ ను.. చిరంజీవి తీసుకున్నారని.. మలయాళ హీరో ఫృధ్వీరాజ్ ప్రకటించారు. అందులో ఆజ్ఞాతంలో ఉన్న డాన్ గా… భారీ ప్రజాదరణ ఉన్న రాజకీయ నేతగా మోహన్ లాల్ నటించారు. తన పదవి కోసం కాకుండా.. తన వాళ్లని పదవి ఎక్కించడానికి మోహన్ లాల్ అందులో ప్రయత్నిస్తారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆ సినిమాను చిరంజీవి ఎంపిక చేసుకోవడంతోనే… టాలీవుడ్లో కాస్త చర్చ నడుస్తోంది.
ఇప్పుడు.. సినిమా చూసేందుకు ఆహ్వానించే పేరుతో… తమిళశైతో భేటీ కావడం కూడా… యాధృచ్చికం కాదంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా…. ఆశ్చర్యం లేదన్న చర్చ.. సహజంగానే… రాజకీయాల్లో వస్తుంది. అదిగో తోక అంటే.. ఇదిగో పులి అనడం…రాజకీయాల్లో చాలా సహజమైన విషయం.