చిరంజీవి తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పి, తాను బీజేపీలో చేరబోతున్నారనే పుకార్లకు ఈరోజు ముగింపు పలికారు. అందుకు మిగిలిన అందరి కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సంతోషించి ఉంటుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటి నుండి అయన పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటూ తన 150వ సినిమాపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నా కూడా ఆయన అసలు పట్టించుకోలేదు. పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నాలు చేయలేదు. ఆయన నోటితో చెప్పకపోయినా పార్టీలో కొనసాగడం ఇష్టం లేనట్లే వ్యవహరిస్తున్నారు. పైగా ఈ మధ్య కాలంలో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడుతుండటంతో మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఇవ్వాళ్ళ ఆయన వాటికి ముగింపు పలుకుతూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టంగా చెప్పడంతో కాంగ్రెస్ పార్టీకి ఏనుగంత బలం వచ్చినట్లయింది.
ఆయన ప్రస్తుతం పార్టీ కోసం పనిచేయకపోయినా పార్టీలోనే ఉంటారనే నమ్మకం, దైర్యం కలిగించారు కనుక ప్రస్తుతానికి కాపు కులస్థులను ఆకట్టుకోవడానికి ఇక తెదేపా, వైకాపాలతో కాంగ్రెస్ పార్టీ పోటీ పడనవసరం లేదు. అలాగే ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనే నమ్మకం ఏర్పడింది. వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా తయారవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం కానీ చిరంజీవి మళ్ళీ సినిమాలలో ప్రజలను ఆకట్టుకొని తన ‘మెగాస్టార్’ పేరుని మళ్ళీ నిలబెట్టుకోగలిగితే అది కాంగ్రెస్ పార్టీకి కొంత వరకు ఉపయోగపడవచ్చును. అయితే వచ్చే ఎన్నికల సమయం నాటికి కూడా రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉన్నట్లయితే చిరంజీవి తన మాటపై నిలబడతారో లేదో చూడాలి.