‘మా’లో గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. ‘మా’లో ప్రస్తుతం రెండు గ్రూపులు నువ్వా, నేనా? అన్నట్టు కొట్టుకుంటున్నాయి. ఓవైపు రాజశేఖర్ వర్గం, మరోవైపు నరేష్ వర్గం.. ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. వీళ్లలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా – పోయేది ‘మా’ పరువే. అందుకే… ‘మా’కు రిపేర్లు చేయడానికి సినీ పెద్దలు రంగంలోకి దిగారు. చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు లాంటి హేమా హేమీల మధ్య ఇటీవల పార్క్ హయత్‌లో ఓ మీటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ‘మా’ రగడ గురించే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రాజశేఖర్, నరేష్… ఇద్దరినీ పిలిపించి, కూర్చోబెట్టి మాట్లాడాలని చిరంజీవి సూచించారట. దీపావళి వెళ్లాక… ఈ మీటింగ్ మరోసారి కొనసాగుతుందని తెలుస్తోంది. ‘మా’లోని విషయాల్ని మీడియాకు లీక్ చేస్తున్నవాళ్లపైనా చిరంజీవి ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఇది వరకు ‘మా’ విషయాలేమీ బయటకు పొక్కేవి కావు. ఆ నాలుగు గోడల మధ్యే ఉండేవి. ఇప్పుడు ‘మా’లో ఏం జరుగుతున్నా.. క్షణాల్లో బయటకు వచ్చేస్తోంది. ఓ వర్గం… పనిగట్టుకుని ఈ లీకేజీల్ని అందిస్తోందని, దానివల్ల ‘మా’కు మరిన్ని కొత్త సమస్యలు వస్తున్నాయని చిరంజీవి భావిస్తున్నార్ట.
నరేష్ పదవీ కాలం రెండేళ్లు. ఆ రెండేళ్ల వరకూ కామ్‌గా ఉండాలని, మధ్యలో దించేసే ప్రయత్నాలు చేస్తే… అది ‘మా’ ప్రతిష్టకే భంగకకరం అని చిరు, మోహన్ బాబు భావిస్తున్నారు. ఈ విషయమై ‘మా’లో ఏకాభిప్రాయం సాధించడానికి ఈ ముగ్గురూ ప్రయత్నిస్తున్నారని సమాచారం. మొత్తానికి ఇప్పటికైనా సినీ పెద్దలు రంగంలోకి దిగారు. వాళ్ల అనుభవం, పెద్దరికం ‘మా’కి ఇప్పుడు చాలా అవసరం. త్వరలోనే ఈ సమస్యలన్నింటి నుంచీ మా గట్టెక్కుతుందేమో చూడాలి.