అగ్ర కథానాయకుడు చిరంజీవి కరోనా సమయంలో సామాజికంగా తన భాధ్యత చాటుకున్నారు. కుదిరితే చారిటీ చేసి సైలంట్ అయిపోయే వ్యక్తిత్వం వుండే చిరు.. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ అనే వ్యవస్థని నెలకొల్పి, అధ్యక్షుడిగా అన్నీ తానై చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ కార్మికులకు దీని ద్వారా సాయం అందింది. కాగా ఇప్పుడీ సంస్థ ద్వారా బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తెలుగు సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. 12 వేల కరోనా రిలీఫ్ కూపన్లను ఈ సంస్థకు ఇచ్చారు. వీటిని అవసరాల్లో ఉన్న సినీ కార్మికులకు పంపిణీ చేయబోతున్నారు.
ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు చిరు. ‘అమిత్ జీ రూ.1500 విలువజేసే 12 వేల కరోనా రిలీఫ్ కూపన్లను తెలుగు చిత్ర పరిశ్రమలోని కార్మికుల కోసం ఏర్పాటు చేశారు. ఈ విషయంలో అద్భుతమైన చొరవ చూపినందుకు బిగ్ బికి ‘బిగ్’ థ్యాంక్స్. ఈ కూపన్లను బిగ్ బజార్ స్టోర్స్‌లోనూ రీడీమ్ చేసుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు చిరు. మొత్తానికి ఈ విషయంలో చిరు తీసుకుంటున్న చొరవని అందరూ అభినందిస్తున్నారు.