ఇటీవలే ప్రముఖ సినీ పాత్రికేయుడు పసుపులేటి రామారావు కన్నుమూశారు. పరిశ్రమలోని చాలామంది దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా చిరంజీవికి ఆయన ఆప్తుడు. చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే పసుపులేటి రామారావుతో పరిచయమైంది. అప్పటి నుంచీ ఆ బంధం కొనసాగుతూనే ఉంది. పసుపులేటి రామారావు ఓ రకంగా మెగా ఇంటి మనిషి. నేరుగా చిరంజీవికే ఫోన్ చేసి, మాట్లాడేంత చనువు ఉన్న అతికొద్ది మంది జర్నలిస్టులలో రామారావు ఒకరు. చిరు కూడా రామారావుపై తన ప్రేమాభిమానాలను చాటుకుంటూనే వచ్చారు. రామారావు కన్నుమూసిన రోజు.. మొట్టమొదటిసారిగా స్పందించి, ఆయన ఇంటికెళ్లి, కుటుంబాన్ని పరామర్శించింది ఆయనే. ఆ సమయంలో అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు తక్షణ సహాయంగా ఇచ్చారు.
ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఏదోలా ఆదుకోవాలని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ భారీ మొత్తాన్ని ఫిక్డ్స్ డిపాజిట్ చేసి, ఆ వడ్డీతో కుటుంబ పోషణ అయ్యేలా చేయాలని చిరు భావిస్తున్నారు. అల్లు అరవింద్, చిరు కలిసి ఓ భారీ మొత్తాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు శివాజీ రాజా సైతం తన వంతుగా రూ.5 లక్షలు సేకరించి ఇస్తానని మాటిచ్చారు. ఇప్పటికే జర్నలిస్టు సంఘాలు రూ.6 లక్షల వరకూ సాయం ప్రకటించాయి. ఓ జర్నలిస్టుకి, అందునా సినీ పాత్రికేయుడికి ఈ స్థాయిలో సాయం అందడం చిన్న విషయం ఏమీ కాదు. రామారావుపై పరిశ్రమకు ఉన్న అభిమానానికి ఇది నిదర్శనం అనుకోవాలి.