‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చేసింది. మే 3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంలో మీడియా చిట్ చాట్ లో ముచ్చటించింది.
‘హాయ్ ఫారియా .. ఎలా ఉన్నారు?
-ఫైన్ అండీ.. సూపర్..
ఆ ఒక్కటీ అడక్కు కథలో మీకు నచ్చిన అంశం ?
-ఇది మంచి కాన్సెప్ట్. పెళ్లి అనేది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. ఇందులో నా పాత్ర నా వ్యక్తిత్వానికి దగ్గరగా వుంటుంది. ఎలాంటి ప్లాన్ లేకుండా ఒక ఫ్లోలో వెళ్ళే పాత్ర. హీరో ఇందుకు భిన్నంగా వుంటారు. ఆయనకి అన్ని ప్లాన్ ప్రకారం జరగాలి. ఈ కాన్ ఫ్లిక్ట్ నచ్చింది. సినిమా హిలేరియస్ గా వచ్చింది. పెళ్లి గురించి, ఇప్పటికి పరిస్థితుల గురించి చక్కగా చర్చించే సినిమా ఇది.
ఈ సినిమా పెళ్లి చుట్టూ వుంది కదా.. పెళ్లిపై మీ అభిప్రాయం ?
-పెళ్లి అనేది గొప్ప బంధం. ప్రతి ఒక్కరికీ అవసరమని నమ్ముతాను. అయితే పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచన లేదు. కానీ అరేంజ్ మ్యారేజ్ మాత్రం చేసుకోను.( నవ్వుతూ)
జాతిరత్నాలు తర్వాత మళ్ళీ అలాంటి విజయం రాలేదనే బాధ ఉందా ?
-లేదండీ. నాకు జర్నీ ముఖ్యం. ఇప్పుడే కెరీర్ మొదలుపెట్టాను. మరో ముఫై ఏళ్ళు పరిశ్రమలో నటిగా వుంటాను. నా నుంచి భవిష్యత్ లో మంచి సినిమాలు చూస్తారు. టబు నా స్ఫూర్తి. ఆమెలా చాలా లాంగ్ రన్ వున్న కెరీర్ ని సెట్ చేసుకోవాలనేది నా ఆలోచన.
పాత్రలు ఎంచుకున్నప్పుడు ఎలాంటి అంశాలు చూస్తారు ?
-ప్రాధాన్యత, నిడివి రెండూ చూస్తాను. కొన్ని సార్లు మాత్రం ఇష్టంతో చేస్తాను. అలా రవితేజ గారిపై ఇష్టంతో రావణాసురలో క్యామియో రోలో చేశాను. ఫలితం ఏమైనప్పటికీ రవితేజ గారితో సినిమా చేశాననే తృప్తి వుంది.
మీ ఎత్తు.. మీకు ప్లస్సా మైనస్సా ?
-దాని గురించి పెద్దగా పట్టించుకోను. దానికి అంత ప్రాధాన్యత వుంటుందని అనుకోను.
యాక్షన్ సినిమాలు చేసే ఆలోచన ఉందా ?
-నిజానికి నాకు యాక్షన్ సినిమాలు సరిగ్గా నప్పుతాయి. ఇప్పుడు పరిశ్రమలో యాక్షన్ చేసే హీరోయిన్స్ లోటు వుంది. ఆ లోటుని తీర్చాలని భావిస్తున్నాను.
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
-మత్తువదలరా 2, అలాగే కొత్త దర్శకుడితో భగవంతుడు అనే సినిమా చేస్తున్నాను. తమిళంలో ఓ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.
బాలీవుడ్ వెళ్ళే ఆలోచన ఉందా ?
-మన పరిశ్రమే అద్భుతంగా వుంది. దేశం మొత్తం చూసే సినిమాలు ఇక్కడే వస్తున్నాయి. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళడంలో అర్ధం లేదు.
ఆల్ ది బెస్ట్
థాంక్ యూ