తెలుగు చిత్ర పరిశ్రమ నాలుగు మూలస్తంభాలుగా అభివర్ణించే అగ్ర కథానాయకుల్లో.. వెంకటేష్ ఒకరు. ‘విక్టరీ’ని ఇంటి పేరుగా మార్చుకొని సినీ ప్రయాణం సాగిస్తున్న వెంకీ.. ఇప్పుడు 75 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఆయన 75వ చిత్రంగా వస్తోంది సైంధవ్. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలివి.
*సంక్రాంతి సెంటిమెంట్ ఈసారి కూడా కలిసొస్తుందని భావిస్తున్నారా ?
-సినిమా కెరీర్ లో ఎన్నో సంక్రాంతులకి వచ్చాం. కొన్ని బాగా ఆడాయి, కొన్ని ఆడలేదు. ఇప్పుడు నాలుగు సినిమా వస్తున్నాయి. అన్నీ బాగా ఆడాలనే ఆశిస్తున్నాను.
*మీ అభిమానులు ఫలానా డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమాలు చేయమని కోరుతుంటారు కదా ? వాళ్ళ అంచనాలని తగ్గట్టుగా సినిమాలు ఎంచుకోవడం ఎలా అనిపిస్తుంది ?
– నా అభిమానులు నన్ను ఎంతగానో అర్ధం చేసుకున్నారు. నేను సినిమాలు చేసే స్టయిల్ వాళ్ళకి మొదట అర్ధమయ్యేది కాదు. కలెక్షన్స్ కోసం నాకు ఆరాటం వుండదు. 98 రోజుల దగ్గర సినిమాని తీసేసేవారు. అది నిర్మాతలు, పంపిణీదారుల నిర్ణయం అని ఊరుకునేవాడిని. ఈ విషయంలో అభిమానులు మొదట్లో చాలా అసహనంగా వుండేవారు. అయితే రానురాను నా స్టయిల్ ని అర్ధం చేసుకున్నారు. ఈ విషయంలో వారికి కృతజ్ఞతతో వుంటాను.
*ఇది 75వ సినిమా కదా.. ఆ ఒత్తిడి ఏమైనా ఉందా ?
-75 అనేది నెంబర్ మాత్రమే. ప్రతి సినిమా ప్రత్యేకమే. ప్రతి సినిమాకి కష్టపడి పని చేయాలి. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. అంతేకానీ ఇదొక మైల్ స్టోన్ సినిమానే ఆలోచన నాకు లేదు.
*ప్రమోషన్స్ లో స్టేజ్ పై డ్యాన్స్ కూడా చేశారు కదా.. 75 స్పెషల్ అనుకోవచ్చా?
అలా ఏం లేదు. అది వాసు పాట. మాంచి బీట్. స్టేజ్ మీద పెట్టారు. అలా కాళ్ళు కదిపేశాను.(నవ్వుతూ)
*ఇన్నేళ్ళ కెరీర్ లో ఒక్క వివాదం కూడా లేకుండా వుండటం ఎలా సాధ్యమైయింది?
నిజంగా నాకు తెలీదు.(నవ్వుతూ) అయితే చిన్నప్పటి నుంచి ఎవరికీ అసౌకర్యం కలిగించకూడదనే మనస్తత్వం నాది.
*సైంధవ్ ఎలాంటి సినిమా ?
న్యూ ఏజ్ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్. ఇలాంటి సినిమా చేయడం నాకూ కొత్తే. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఇలాంటి కథలు ఇంకా వచ్చే అవకాశం వుంది.
*నవాజుద్దీన్ సిద్ధిఖి తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
మంచి ఫీలింగ్ అండీ. ఆయన అద్భుతమైన నటుడు. మాములు సీక్వెన్స్ ని కూడా డిఫరెంట్ గా చేసే నటుడు. ఇందులో ఆయన పాత్ర ప్రేక్షకులకు ఎంజాయ్ చేస్తారు.
* స్వామి వివేకనంద బయోపిక్ ఏమైయింది ?
-స్క్రిప్ట్ సరిగ్గా రాలేదండీ. ఒక లెవల్ వరకూ వచ్చి ఇంక ముందుకి కదల్లేదు
*కొత్తగా చేయబోతున్న సినిమా ?
మూడు కథలు వున్నాయి. అందులో ఒకటి ఫైనల్ చేయాలి
*ఆల్ ది బెస్ట్
థాంక్స్