రామ్‌చరణ్ ఖాతాలో హిట్లు, సూపర్ హిట్లున్నాయి. డాన్స్ పరంగా అతన్ని వేలెట్టి చూపించలేం. చిరు అంత కాకపోయినా ఆ పేరెప్పుడూ చెడగొట్టలేదు. యాక్షన్ సీన్లలోనూ కేక పెట్టిస్తాడు. మరి నటన…? ఈ విషయంలో కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వినిపిస్తుంటుంది. ఎన్టీఆర్ లోని నటుడ్ని గురించి చెప్పుకోవడానికి రాఖీలా, ప్రభాస్‌కి ఓ చక్రంలా, బన్నీకి ఓ వేదంలా.. చరణ్ ఖాతాలో చెప్పుకోవడానికి ఓ సినిమా అంటూ లేకపోయింది. గోవిందుడు అందరివాడేలేలో సెంటిమెంట్ పండించే అవకాశం చరణ్‌కి వచ్చింది. కానీ అక్కడ కూడా చరణ్ రాణించలేదన్నది వాస్తవం.
మెగా ఫ్యాన్స్‌కి చరణ్ ఏం చేసినా నచ్చుతుంది. నాన్ మెగా ఫ్యాన్స్ మాత్రం కొన్ని చోట్ల చరణ్ బాగా ఇబ్బంది పడుతుంటాడని చెబుతుంటారు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ చరణ్‌లో పలకవు అన్నది పెద్ద కాంప్లయింట్. అయితే.. `రంగస్థలం` చూస్తుంటే.. చరణ్ ఆ మైనస్సులన్నీ దాటేసేలా కనిపిస్తున్నాడు. చరణ్‌లోని నటుడ్ని.. మరో కోణంలో పరిపూర్ణంగా ఆవిష్కరించే వీలు.. చిట్టిబాబు కల్పించాడన్న గట్టి నమ్మకం వేస్తోంది. చిట్టిబాబు నిజంగా ఓ ఛాలెంజింగ్ రోల్. వినికిడి శక్తి లేని ఓ పాత్రని పోషించడం అంటే మామూలు విషయం కాదు. పైగా పల్లెటూరి బైతు. మొరటు మనిషి. పాత్రలో ఇన్ని లక్షణాలు పెట్టుకుని చరణ్ ఎలా నెగ్గుకొస్తాడా అనే డౌట్లు చాలామందిలో ఉన్నాయి. అవన్నీ.. రంగస్థలం ట్రైలర్ క్లియర్ చేసేసింది. చరణ్ కి ఈ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ హిట్ ఇస్తుందా అనేదే పక్కన పెడితే – చిరంజీవి చెప్పినట్టు ఈ సినిమా చరణ్‌ని నటుడిగా ఓ మెట్టుపైకి ఎక్కిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది.