హైదరాబాద్: చిత్తూరు నగర మేయర్ కటారి అనూరాధ ఇవాళ ఉదయం హత్యకు గురయ్యారు. ఇవాళ ఆమె, ఆమె భర్త, తెలుగుదేశం సీనియర్ నాయకుడు మోహన్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ ఛాంబర్లో ఉండగా, ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు లోపలికి ప్రవేశించి అతి దగ్గరనుంచి కాల్పులు జరిపారు. అనూరాధకు కళ్ళపై, ఛాతీపై బుల్లెట్లు తగిలాయి. ఆమె వెంటనే చనిపోయారు. భర్త మోహన్‌కు కూడా గాయాలయ్యాయి. అతనిని తమిళనాడులోని వేలూరు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మరోవైపు దాడికి పాల్పడినవారిలో ఇద్దరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పక్కా ప్లాన్ ప్రకారమే హంతకులు దాడి చేసినట్లు కనబడుతోంది.
ఈ కాల్పుల ఘటన వెనక రాజకీయ కక్షలు ఉన్నట్లు సమాచారం. దీని వెనక కటారి మోహన్ ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు సీకే బాబు హస్తం ఉందని కొందరు, మోహన్ సమీప బంధువులే ఉన్నారని మరికొందరు చెబుతున్నారు. మోహన్‌కు, వీరికీ మధ్య దీర్ఘకాలంగా గొడవలు ఉన్నాయని తెలిసింది. మోహన్‌పై గతంలో కూడా హత్యాయత్నాలు జరిగాయి. సీకే బాబు రెడ్డి సామాజికవర్గం వ్యక్తి కాగా, కటారి మోహన్, అనూరాధ కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ఈ ఘటనపై విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమ స్పందిస్తూ, కాపు సామాజికవర్గానికి తెలుగుదేశం ప్రాధాన్యత ఇస్తుండగా, వైసీపీ వారు భరించలేక దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిణామంపై విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మానవత్వం మరిచిపోయి మృగాలలాగా మహిళ అనికూడా చూడకుండా చంపేయటం దారుణమని అన్నారు. హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, శాంతి భద్రతల విషయంలో ఉపేక్షించేది లేదని చెప్పారు. అనూరాధ మంచి క్రియాశీలంగా పార్టీలో పనిచేసేవారని, ఇటీవల తిరుపతిలో జరిగిన పార్టీ కార్యక్రమంలోకూడా ముందువరసలో కూర్చుని తనకు కనిపించారని అన్నారు. నేరస్తులను వదిలేది లేదని చెప్పారు. మహిళను చంపటం అన్యాయమని అన్నారు.