చిత్తూరు నగర మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ లపై ఈరోజు జరిగిన హత్యా ప్రయత్నంలో అనురాధ అక్కడికక్కడే మరణించగా, మోహన్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయన కొద్ది సేపటి క్రితమే స్పృహలోకి వచ్చినట్లు సమాచారం. ఈ హత్యకు మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ (చింటూ) కారణమని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. చింటూ తరచూ మోహన్ న్ని డబ్బు కావాలని అడుగుతుండేవాడు. దానితో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కొన్ని రోజుల క్రితం చింటూ తనకి రూ.3లక్షలు కావాలని మోహన్ న్ని అడిగినప్పుడు ఆయన ఇవ్వకపోవడంతో, అప్పుడే ఈ హత్యాయత్నానికి పధకం వేశాడు. అతనికి వెంకటా చలపతి, రెడ్డప్ప, వెంకటేష్, మంజూనాధ అనే నలుగురు వ్యక్తులు సహకరించారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు బురకాలు ధరించి, మేయర్ చాంభర్ లో ప్రవేశించి మేయర్ అనురాధ, అక్కడే ఉన్న ఆమె భర్త మోహన్ పై కాల్పులు జరిపి పారిపోయారు.
ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే పారిపోయిన వారిలో ఇద్దరు దుండగులు పోలీసులకి లొంగి పోయారు. వారు ఎవరో పోలీసులు ఇంకా ప్రకటించలేదు. అలాగే ఈ హత్యకు ప్రధాన సూత్రధారి చింటూ లొంగిపోయిన వారిలో ఉన్నడా..లేక అతను కూడా పరారిలో ఉన్నడా? అనే విషయం ఇంకా పోలీసులు ప్రకటించలేదు. పోలీస్ జాగిలాలు పోలీసులను నేరుగా చింటూ ఇంటికే తీసుకువెళ్ళాయి. మేయర్ హత్యతో ఆవేశంతో ఊగిపోతున్న తెదేపా శ్రేణులు చింటూ ఇంటిపై దాడి చేసి ఇంట్లో వస్తువులను, బయట నిలిపి ఉంచిన మూడు వాహనాలను ద్వంసం చేసారు. ప్రస్తుతం చిత్తూరులో తీవ్ర ఉదిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. తప్పించుకొని పారిపోయిన మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. వారు చెన్నై వైపు పారిపోయి ఉంటారనే అనుమానంతో చెన్నై పోలీసులకు వారి వివరాలు తెలియజేసి వారి సహకారం కూడా తీసుకొంటున్నారు.