రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత రాజమౌళి కూడా తగినంత సమయం తీసుకొని, ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తున్నాడు. మహేష్ బాబు మినహా… మిగిలిన ఏ ఆర్టిస్టునీ ఇప్పటి వరకూ ఫైనల్ చేయలేదు. ఫృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతున్నా, దానిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కనీసం స్పందించలేదు. ఈ సినిమా కోసం ఇండోనేషియా నుంచి చెస్లా అనే హీరోయిన్‌ని రంగంలోకి దింపినట్టు తెలుగు 360 ముందే చెప్పింది. దాదాపు ఆమెను కథానాయికగా ఫిక్స్ చేసినట్టే.
ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం విక్రమ్ ని సంప్రదించినట్టు టాక్. చిన్న పాత్ర అయినా, అందులో స్టార్ డమ్ ని మిక్స్ చేయడానికి రాజమౌళి ఇష్టపడతాడు. విలన్ పాత్ర కోసం కూడా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొంటాడు. ఇప్పుడు ఆయన దృష్టి విక్రమ్ పై పడింది. రాజమౌళి నుంచి ఆఫర్ రాగానే… ఎంత పెద్ద స్టార్ అయినా, ఒప్పుకోవాల్సిందే. ఆయన స్థాయి అలా ఉంది. విక్రమ్ ఈ ఆఫర్ కు `నో` చెప్పే అవకాశం లేదు. సో.. మహేష్ విలన్ గా విక్రమ్ దాదాపుగా సెట్ అయిపోయినట్టే. ఈ యేడాది చివర్లో ఈ సినిమా పట్టలెక్కుతుంది. 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈలోగా మహేష్ మరో సినిమా చేయడు. కనీసం కమర్షియల్ యాడ్‌లో కూడా కనిపించడు. మహేష్ లుక్ రివీల్ కాకూడదన్న ఉద్దేశంతోనే రాజమౌళి ఈ కండీషన్ విధించినట్టు తెలుస్తోంది.