స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వచ్చిన ‘డియర్’ సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన కల్వన్ అనే చిత్రాన్ని చోరుడు టైటిల్ తో డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ లో రిలీజ్ చేశారు. చాలా రోజుల తర్వాత దర్శకుడు భారతీరాజా పూర్తిస్థాయి నిడివి వున్న పాత్రలో కనిపించారిందులో. పర్యావరణం, మానవబంధాల ఇతివృత్తాన్ని ఓ దొంగ కథతో ముడిపెట్టి తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? ఇందులో చూపించిన సందేశం, భావోద్వేగాలు హత్తుకునేలా వున్నాయా?
అది తమిళనాడు పశ్చిమ కనుమలలోని అడవికి ఆనుకొనివున్న ఓ గ్రామం. కెంబన్ (జీవి ప్రకాష్ కుమార్) సూరి (దీనా) మంచి స్నేహితులు. ఇద్దరూ అనాధలే. ఊర్లోనే చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఓ పూరిపాకలో జీవిస్తుంటారు. కెంబన్ అడవిలో కాపలా కాసే ఉద్యోగం కోసం పోలీసులు వెనుక తిరిగుతుంటాడు. ఉద్యోగం కావాలంటే కొంత డబ్బు కావాలి. అది సమకూర్చే పనిలో ఉంటాడు. ఓ రోజు బాలామణి (ఇవానా) ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్ళిన కెంబన్.. ఆమెను చూసి మనసు పారేసుకుంటాడు. బాలామణి కూడా కెంబన్ ని ఇష్టపడుతుంది. వారి ప్రేమకథ అలా సాగుతుండగా.. అనాథాశ్రమంలో ఓ వృద్ధుడు (భారతీరాజా)ని దత్తత తీసుకుంటాడు కెంబన్. దొంగతనం చేసి బతుకుతున్న కెంబన్, తాత వయసులో వున్న వృద్ధుడుని దత్తత తీసుకోవడానికి కారణం ఏమిటి? బాలామణితో కెంబన్ ప్రేమ ఫలించిందా? కెంబన్ కోరుకునే ఉద్యోగం వచ్చిందా? లేదా.. ఇవన్నీ తెరపై చూడాలి.
చిన్న పాయింటే అయినప్పటికీ అప్పటివరకూ ఎవరూ టచ్ ని కోణంలో చూపిస్తూ.. అలరిస్తూ.. ఆలోజింపచేసే చిత్రాలు చేయడంలో మలయాళం మేకర్స్ మంచి ప్రభావాన్ని చూపిస్తుంటారు. చోరుడు దర్శకుడు పీ.వి శంకర్ కూడా అలాంటి టచ్ వున్న ఓ పాయింట్ నే ఎంచుకున్నాడు. పాయింట్ పరంగా చూస్తే చోరుడులో మేటర్ వుంది. అడవిని ఆక్రమించుకొని జీవిస్తున్న జనం, ఏనుగుల దాడి, జీవితంలో స్థిరపడాలని ఆశపడే ఓ దొంగ, బతకు తెరువు దూరమై అనాధగా మిగిలిన ఓ వ్యక్తి.. ఇలా నాలుగువైపుల సంఘర్షణతో కథని నడపాలని భావించాడు దర్శకుడు. అయితే ఈ సంఘర్షణ తెరపైకి అనుకున్నంత ప్రభావంతంగా రాలేదు.
ఏనుగుల దాడిలో ఓ గ్రామస్తురాలు చనిపోయిన ఘటనతో కథ మొదలౌతుంది. తర్వాత దొంగగా కెంబన్ పరిచయ సన్నివేశాలు మొదట్లో ఆసక్తిగానే వుంటాయి. తన ట్రాక్ ఏదో సరదాగా ఉన్నప్పటికీ ఇందులో కొంత సీరియస్ పాయింట్ వుందనే సంగతి అర్ధమౌతూవుంటుంది. ఇకపోతే కెంబన్, బాలామణి ప్రేమకథని అవసరానికి మించి సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో సోసో గానే నడిపేసిన భావన కలుగుతుంది.
ఎప్పుడైతే తాతని దత్తత తీసుకున్నారో అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. దత్తత తీసుకోవడానికి గల కారణం, తర్వాత వచ్చే సన్నివేశాలు కథలో సంఘర్షణని బాగానే పట్టుకున్నాయి. తమ లక్ష్యం చేరుకోవడానికి కెంబన్, సూరి చేసే ప్రయత్నాలు కొన్నిచోట్ల నవ్విస్తే ఇంకొన్ని చోట్ల మనుషుల స్వార్ధానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. నిజానికి తాత పాత్ర కెంబన్ ఇంటికి వచ్చిన తర్వాత డ్రామాని ఇంకా చక్కగా నడిపించే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు చాలా సన్నివేశాలు సాదాసీదాగానే తీశాడనిపించింది. తాతకి వున్న ఫ్లాష్ బ్యాక్ టచ్చింగ్ గానే వుంటుంది. ఆ కథని పర్యావరణం, మనిషి స్వార్ధాలు, మారుతున్న కాలానికి ముడిపెట్టడం బావుంది. క్లైమాక్స్ ఊహకుముందే అందిపోతుంది కానీ ఏనుగులతో చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునేలానే వుంటుంది.
దొంగ పాత్రలో జీవి ప్రకాష్ సహజంగా ఒదిగిపోయాడు. తన లుక్ కూడా సరిపోయింది. అయితే ఎమోషనల్ సీన్స్ లో మరింత లీనమై నటించివుంటే బావుండేది. సూరి పాత్రలో చేసిన దీనా నటన కూడా నేచురల్ గానే వుంది. భారతీరాజా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటివరకూ ఆయన చేసిన మంచి పాత్రల్లో ఈ సినిమా కూడా వుంటుంది. చాలా కీలకమైన పాత్ర. తన అనుభవంతో ఆ పాత్రని సులువుగా పండించారు. ఆయనకి ఇచ్చిన మేకోవర్ కూడా బావుంది. ఒక విధంగా ఇందులో ఆయనది ఒక హీరో తరహ పాత్ర. ఇవానా పర్వాలేదనిపిస్తుంది. తన లుక్ లైవ్లీగా వుంది. మిగిలిన పాత్రలు కథ అవసరం మేరకు బాగానే కుదిరాయి.
జీవీ ప్రకాష్ నేపధ్య సంగీతం ఆకట్టుకునేలానే వుంటుంది. పరిమిత బడ్జెట్ లో తీసినప్పటికీ రియల్ లోకేషన్స్ వాడుకోవడం సహజత్వం తీసుకొచ్చింది. ఏనుగులతో చేసిన యాక్షన్ సీక్వెన్స్ బాగానే కుదిరింది. పులి గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయింది. తెలుగు డబ్బింగ్ డీసెంట్ గానే వుంది. ఒక ఎమోషనల్ పాయింట్ కి బలమైన భావోద్వేగాలు జోడించి మంచి ఫీల్ గుడ్ సినిమా అందించాలనే దర్శకుడి ఆలోచన బావున్నప్పటికీ అందులోని ఎమోషన్స్ ప్రేక్షకుడు ఆశించిన స్థాయిలో తెరపై పండకపోవడం కాస్త వెలితిగానే వుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో జీవి ప్రకాష్ నుంచి వచ్చిన చిత్రాలతో పోల్చుకుంటే చోరుడు కాస్త బెటర్ గానే అనిపిస్తుంది.