సభామర్యాద….
బహుశా టాలీవుడ్ మెల్లమెల్లగా ఈ పదాన్ని మర్చిపోతోందేమో. వేదికపై ఏదోదో మాట్లాడేస్తున్నారు హీరోలు. అందులో బూతులొచ్చినా సర్దుకోవాలి. సౌండుకే పరిమితమైన ఆ ఎగస్ట్రాలు.. ఇప్పుడు ‘విజువల్’ వరకూ చేరాయి. ‘కవచం’ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో కెమెరామెన్ ఛోటా కె.నాయుడు ప్రవర్తన చూస్తే… వేదికపై ఇలాక్కూడా ప్రవర్తించాలా? అనిపించేలా ఉంది.
‘కవచం’ ట్రైలర్ లాంఛ్ సరదాగానే మొదలైంది. మెహరీన్‌కి ప్రేమతో కాజల్ ఓ ముద్దు ఇచ్చింది. హీరోయిన్లు ఇద్దరూ… అలా ముచ్చట పడితే.. చూడ్డానికి బాగానే ఉంటుంది. అయితే ఇదే అదునుగా.. ఛోటా విజృంభించాడు. కాజల్ తన స్పీచులో భాగంగా ‘స్మాల్’ (ఛోటాకి ముద్దుపేరన్నమాట) పేరు ప్రస్తావించింది. దాంతో కాజల్ దగ్గరకు వచ్చేసిన ఛోటా.. గబుక్కున కాజల్ మెడపై ముద్దు ఇచ్చేశాడు. ఈ హఠాత్ పరిణామాణికి కాజల్ కాస్తకంగారు పడి.. సెకన్ల వ్యవధిలోనే తేరుకుని.. ‘ఛాన్స్ పే డాన్స్.. మన ఫ్యామిలీనే కదా. చల్తా’ అన్నట్టు పెద్ద మనసుతో లైట్ తీసుకుంది. కాజల్ ని ఛోటా కె.నాయుడు ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు, తన ఇన్నర్ ఫీలింగ్ ఏమిటి? అనేది కాసేపు పక్కన పెడదాం. తన ప్రేమని, అభిమానాన్ని ప్రకటించడానికి ఛోటాకి చాలా దారులున్నాయి. ముద్దే పెట్టాలా…?? ఒకవేళ పెట్టాడే అనుకుందాం.. హీరో, హీరోయిన్లు రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకున్నట్టు మెడపైనే పెట్టాలా?
పక్కనే ఉన్న తమన్ ‘అలా ముద్దు పెట్టుకోవచ్చా?’ అన్నట్టు కాస్త అసహనం ప్రకటించినట్టు కనిపించింది. ఛోటా దాన్ని సమర్థించుకుంటూ.. ‘ఎందుకు పెట్టుకోకూడదు’ అంటూ వచ్చీరాని ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. ఛోటా ఇలా… వేదికపై ఎగస్ట్రాలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఈమధ్య మైకు పిచ్చి పట్టుకుంది కూడా. స్టేజీపై మైకు దొరగ్గానే… ఏదోటి మాట్లాడేస్తున్నాడు. సుదీర్ఘంగా సాగే ఆ స్పీచులో విషయం తక్కువ, బిల్డప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ స్పీచులకు పరిమితమైన ఛోటా అల్లరి.. ఇప్పుడు ముద్దుల వరకూ పాకింది. మున్ముందు ఎక్కడి వరకూ వెళ్తుందో..??