‘మళ్లీ నా జోలికొచ్చారో… చూసుకొందాం’ అంటూ సినిమా ఫక్కీలో కెమెరామెన్ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హరీష్ శంకర్. వీరిద్దరూ కలిసి ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా చేశారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్యా ఏదో కమ్యునికేషన్ గ్యాప్. ఛోటా తన ఇంటర్వ్యూలలో పదే, పదే.. హరీష్ శంకర్ గురించి ప్రస్తావించడం, తక్కువ చేసి మాట్లాడడం హరీష్‌కు నచ్చలేదు. అందుకే వార్నింగ్ ఇస్తూ ఓ లేఖ రాశాడు. మీరంటూ గౌరవం ఉంది, మీరు నాకంటే వయసులో పెద్దవారు అంటూనే ‘మళ్లీ ఇలాంటి సీన్ రిపీట్ అయితే, ఎనీ సెంటర్, ఎన్నీ ప్లేస్, ఐ యామ్ వెయిటింగ్’ అంటూ సోషల్ మీడియా సాక్షిగా తొడ గొట్టేశాడు. దాంతో… హరీష్, ఛోటాల మధ్య ఏం జరిగింది? ఈ గొడవ ఎటు పోతుందన్న ఆసక్తి… అందరిలోనూ నెలకొంది.
వీరిద్దరూ కలిసి చేసిన ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా మేకింగ్ లోనే ఇద్దరికీ మధ్య సయోధ్య కుదర్లేదు. మధ్యలో ఛోటాని తొలగించాలనుకొన్నారు. కానీ ఏమైందో, ఛోటానే చివరి వరకూ కంటిన్యూ అయ్యాడు. తన పని విషయంలో హరీష్ జోక్యం చేసుకోవడం ఛోటాకి నచ్చలేదు. దాంతో.. ఇద్దరూ సెట్లో ఎడమొహం, పెడమొహంలా ఉండేవార్ట. ఆ సినిమా తరవాత మళ్లీ ఇద్దరూ పని చేయలేదు. కానీ.. ఛోటా మీడియా ముందు మాత్రం హరీష్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చారు. చాలా ఇంటర్వ్యూలలో హరీష్ పనితీరుపై ఆయన సెటైర్లు వేస్తూనే వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా తమ మధ్య గొడవ ప్రస్తావించారు. హరీష్ తన పనిలో జోక్యం చేసుకొనేవాడని, అస్తమానూ అడ్డు పడేవాడని, అది తనకు నచ్చేది కాదని, కానీ దర్శకుడు విజన్‌ని గౌరవించి వదిలేసేవాడ్నని చెప్పుకొచ్చారు. అయితే ఇదే మొదటి సారి కాకపోవడం, పదే పదే తన పేరు ప్రస్తావించడం హరీష్‌కు కోపం తెప్పించింది. అందుకే ఇలా రియాక్ట్ అయ్యాడు.
సెట్లో ఉన్నవాళ్లెవరైనా దర్శకుడు చెప్పింది చేయాలి. అదంతే. ఎందుకంటే దర్శకుడే కెప్టెన్ కాబట్టి. అందుకే హరీష్ కోణంలో తను రైటు. ఓ సీరియర్ కెమెరామెన్ ఏం తీయాలో, ఎలా తీయాలో తెలీదా? అనేది ఛోటా పాయింట్. ఇద్దరూ దూకుడు స్వభావం కలిగిన వ్యక్తులే. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ చెలరేగిపోయేవాళ్లే. అందుకే.. ఎవరూ ఆగడం లేదు. మరి ఈ గొడవ ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతుందో..?