హైదరాబాద్ శివారు అంటే విజయవాడ వైపు ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ కాదు. చౌటుప్పల్ వరకూ హైదరాబాద్ శివారే. రీజనల్ రింగ్ రోడ్ ప్రస్తావన వచ్చిన తర్వాత సైలెంటుగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు అదే దారిలోకి వెళ్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్ ప్లాన్లో చౌటుపల్ల వద్ద భారీ జంక్షన్ ఉంది. ఈ కారణంగా అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంచనాతో స్థలాలు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మొత్తం 12 ఇంటర్ చేంజర్స్ నిర్మించేలా డిజైన్ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులతో కనెక్ట్ అయ్యే ఈ 12 ప్రాంతాల్లో భారీ జంక్షన్స్ ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జరుపుకోబోయే ఈ భారీ ఇంటర్ చేంజర్స్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్స్ లో విజయవాడ జాతీయ రహదారిపై నేషనల్ హైవే 65ను కనెక్ట్ చేస్తూ చౌటుప్పల్ దగ్గర నిర్మించబోయే ఇంటర్ చేంజర్ చుట్టు పక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఇటు హయత్ నగర్ నుంచి పెద్ద అంబర్ పేట్ వరకు మౌలిక సదుపాయాలు బాగా ఏర్పడటంతో కాలనీల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు, చౌటుప్పల్ దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో అక్కడి వరకూ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందనుంది. వచ్చే పదేళ్లలో ఒకప్పుడు పటాన్ చెరులా చౌటుప్పల్ మారే అవకాశం కనిపిస్తోంది.