చౌకీదార్ చోర్ హై (కాపలాదారుడే దొంగ) అంటూ ఇదే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తూ వస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మొదలుకొని ప్రముఖ భాజపా నేతలంతా వారివారి ట్విట్టర్ అకౌంట్లలో పేరుకు ముందు చౌకీదార్ అనే పదాన్ని చేర్చుకున్న సంగతీ తెలిసిందే. దీంతో, మోడీతోపాటు ఇతర భాజపా నేతలందరినీ కూడా చోర్ హై రాహుల్ గాంధీ విమర్శిస్తున్న పరిస్థితి. అయితే, ఇదే నినాదం విషయమై సుప్రీం కోర్టుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. దీంతో ఈ నినాదాన్ని ఇక్కడితో వదిలేస్తారు అనుకుంటే… వదిలే ప్రసక్తే లేదంటున్నారు రాహుల్.
ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి తాను చేసిన చౌకీదార్ చోర్ హై నినాదాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఈయనే అసలైన దొంగ కాబట్టి, అదే వాస్తవం కాబట్టి కట్టుబడి ఉంటున్నా అన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యల్లో సుప్రీం కోర్టు ప్రస్థావన తీసుకొచ్చి ఆపాదించాననీ, అందుకే కోర్టుకు క్షమాపణలు చెప్పానన్నారు. తాను భాజపాకిగానీ, ప్రధాని మోడీకిగానీ క్షమాపణలు చెప్పలేదనే విషయాన్ని ఆ పార్టీ వాళ్లంతా గుర్తించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సగం పూర్తవగానే ఓడిపోతామని మోడీకి స్పష్టంగా అర్థమైపోయిందనీ, అందుకే భారత సైనిక చర్యలు, సర్జికల్ స్ట్రైక్స్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశంలో రైతులు సంక్షోభంలో ఉన్నారనీ, యువత నిరుద్యోగంతో అవస్థలు పడుతోందనీ వీటి గురించి మోడీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని రాహుల్ విమర్శించారు.
చౌకీదార్ చోర్ హై నినాదం ఆపేది లేదంటున్నారు! కానీ, దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి నిజంగానే మేలు జరుగుతుందా..? ఈ నినాదం రాహుల్ మాట్లాడుతున్నంతగా ప్రజల్లో చర్చనీయం అయిందా అంటే… ప్రజల్లోకి బాగానే వెళ్లిందని చెప్పొచ్చు. రాఫైల్ యుద్ధ విమానాల తయారీ ఒప్పందం నేపథ్యంలో ఇదే నినాదంలో రాహుల్ మరింత పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే, ఈ రాఫైల్ అంశం సమాజాంలో కొన్ని వర్గాలకు మాత్రమే అర్థమౌతుందని అనుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాశ్యుల వరకూ రాఫైల్ లాంటివి వెళ్లే అవకాశాలు తక్కువే అని చెప్పాలి. మోడీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దు, జీఎస్టీలాంటి నిర్ణయాల పట్ల వ్యతిరేకత ప్రజల్లో బాగానే ఉంది. దీన్ని కవర్ చేయడానికే బీసీ కార్డు, సైన్యం విజయాలు లాంటివి మోడీ ప్రయోగిస్తున్న పరిస్థితి. వీటిని కూడా తిప్పి కొట్టే విధంగా చోకీదార్ చోర్ హై అంటూ ప్రచారం చేయడం కాంగ్రెస్ కి మేలు చేసే అంశంగానే కనిపిస్తోంది. ఆ మేలు ఏస్థాయిలో జరిగిందనేది ఫలితాల్లో చూడాల్సిందే.