మత సమావేశాల్లో రాజకీయ ప్రసంగాలు చేయడం తప్ప ప్రత్యేకంగా ఎలాంటి రాజకీయ సభలు, సమావేశాలు పెట్టని బ్రదర్ అనిల్ కుమార్ హఠాత్తుగా విజయవాడలో బీసీ సంఘాలు, క్రైస్తవ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ సమావేశం జరిగినట్లుగా .. ఏర్పాట్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సమావేశంలోనే బ్రదర్ అనిల్ పార్టీ పెట్టబోతున్నానని చెప్పారు. ఆవిషయాన్ని సమావేశంలో పాల్గొన్న వారు బయటకు చెప్పారు. కానీ బ్రదర్ అనిల్ మాత్రం అలాంటిదేం లేదని.. ఏదైనా ఉంటే తాను చెబుతానని ప్రకటించారు. పార్టీ పెడతారా.. లేకపోతే పార్టీ పెడతామనే సంకేతాలను ఎవరికైనా పంపి లెక్కలు సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారా అన్నది తర్వాత సంగతి. కానీ బ్రదర్ అనిల్ ఓ సందేశాన్ని మాత్రం బయటకు పంపేశారు.
విజయవడా సమావేశం ద్వారా బ్రదర్ అనిల్ చెప్పిన ముఖ్యమైన అంశం ఏమిటంటే వైఎస్ జగన్ కోసం.. పని చేసిన.. ప్రచారం చేసిన.. ప్రార్థనలు చేసిన క్రైస్తవువులెవరికీ మేలు జరగడం లేదు. ఒక్క సారి మాత్రం రూ. ఐదు వేలు ఇచ్చి ఊరుకున్నారు. తర్వాత ఇవ్వడం లేదు. కనీసం కలిసేందుకూ అవకాశం ఇవ్వడం లేదు. ఎప్పుడూ మొహర్భానీకి పొగిడేవారికి కొంత మందికి చాన్సిచ్చి మిగతా ఎవర్నీ కలవడం లేదు. క్రైస్తవులు ఆర్థికంగా చితికిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదే సమయంలో వైసీపీ కోసం సొంతంగా ఖర్చు పెట్టుకుని పని చేసిన వారికీ ప్రతిఫలం లేకుండా పోయింది. ఈ సందేశాన్ని బ్రదర్ అనిల్ బయటకు పంపించారు.
రెండేళ్ల నుంచి తననూ సీఎం జగన్ కలవలేదని .. తనకూ సమయం ఇవ్వలేదని బ్రదర్ అనిల్ చెప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే.. నన్నే పట్టించుకోలేదు.. మీరెంత అన్న అర్థంలో అనిల్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో అన్ని వర్గాలు ప్రభుత్వంపై అంతృప్తిగా ఉన్నా.. క్రిస్టియన్లు మాత్రం ఎంతో కొంత ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటారన్న ప్రచారం ఉంది. కానీ బ్రదర్ అనిల్ ఇప్పడు క్రిస్టియన్లు కూడా అసంతృప్తిగా ఉన్నారన్న విషయాన్ని బయటకు తీసుకు వస్తున్నారు.