బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరిపోయారు. వైసీపీ తరపున ఇంచార్జ్ గా చుండూరు రవి అనే వ్యక్తిని నియమించారు. ఎవరు ఈ చుండూరు రవి అని జిల్లా వైసీపీ నేతలంతా ఒకరినొకరికి ఫోన్లు చేసి తెలుసుకున్నారు. చాలా మందికి ఈ చుండూరు రవి ఎవరో తెలియదు. ఒంగోలు లాంటి చోట..అది కూడా దామచర్ల జనార్ధన్, బాలినేని లాంటి వాళ్లను ఎదుర్కోని పార్టీని నిలబెట్టాల్సిన చోట ముక్కూ ముఖం తెలియని నేతను ఇంచార్జ్ ప్రకటించడంపై వైసీపీలోనే విస్మయం వ్యక్తమవుతోంది.
అయితే జగన్ తమ పార్టీ ఇంచార్జ్ గా బాలినేనినే భావిస్తున్నారని అంటున్నారు. ఆయన బలపడితే తాము బలపడినట్లేనని అందుకే ఆయనకు ఇబ్బంది లేకుండా ఆయన చాయిస్ తోనే చుండూరు రవిని ఇంచార్జుగా పెట్టాలన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన మిషన్ తో పవన్ పార్టీలో చేరాలన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనకు ఇబ్బంది లేకుండా జగన్ ఇంచార్జును నియమించడం ఆసక్తికరంగా మారింది.
ఒంగోలు వైసీపీ క్యాడర్ అంతా బాలినేని వైపు ఉంటుంది. కానీ వారంతా జనసేన ఫ్యాన్స్ కాదు. బాలినేని తరహాలో గట్టి నాయకత్వం ఇచ్చేవారు కనిపిస్తే వారితో నడుస్తారు. అప్పుడు బాలినేని బలహీనం అవుతారు. ఈ లాజిక్ అందరికీ తెలుసు. కానీ ఆయనను బలహీనం చేయకూడదనే జగన్ ఎవరికీ తెలియని ఇంచార్జిని ప్రకటించారు. ఇది బాలినేనికి మేలే కానీ.. మరి జనసేనకూ మేలు చేస్తుందా?