యోగిబాబు ఇప్పుడు ఫుల్ డిమాండ్ వున్న కమెడియన్. ఒకవైపు కామెడీ పాత్రలు చేస్తూనే మరోవైపు లీడ్ రోల్స్ లో కూడా అలరిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరిస్ వచ్చింది. అదే ‘చట్నీ సాంబార్’. రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ సిరిస్ ఈ వారం హాట్ స్టార్ లో విడుదలైయింది. ఈ ‘చట్నీ సాంబార్’ కథేంటి? యోగిబాబు పంచిన వినోదం కాలక్షేపాన్ని ఇచ్చిందా?
రత్నస్వామి (నిళల్ గల్ రవి) ఊటీలో ‘అముద’ పేరుతో ఒక కేఫ్ నడుపుతూ ఉంటాడు. అక్కడ ‘సాంబార్’ చాలా ఫేమస్. చుట్టుపక్కల ప్రాంతాల వారు అక్కడకి వచ్చి లొట్టలేసుకొని సాంబార్ రుచి చూస్తుంటారు. రత్నస్వామి భార్య జయలక్ష్మి (మీరా కృష్ణన్) కొడుకు కార్తిక్ (చంద్రన్) కూతురు అముద (మైన నందిని) ఆముద భర్త ఇలాంగో(నితిన్ సత్య). ఆ ఇంట్లో వంట మనిషి సోఫీ (వాణి భోజన్). ఆమె కూడా ఇంట్లో మనిషిలానే కలిసిపోతుంది. చాలా హ్యాపీ ఫ్యామిలీ. అంతా సజావుగా సాగుతుందనుకునే సమయంలో రత్నస్వామి కేన్సర్ బారిన పడతాడు. తాను ఎక్కువ కాలం బ్రతకడని తెలుస్తుంది. దీంతో కొడుకు కార్తిక్ కి ఓ రహస్యం చెబుతాడు. గతంలో తాను చెన్నై లో ఉన్నప్పుడు ‘అముద’ (దీపా శంకర్)తో రిలేషన్ ఉండేదని, తన కారణంగా ఆముదకి కొడుకు కూడా పుట్టాడని, అముద కొంతకాలం క్రితం చనిపోయిందని, అముదకి పుట్టిన కొడుకు చేతులుమీద తనకి అంత్యక్రియలు జరగాలని, తనని కూడా ఇంట్లో మనిషిలానే చూడాలని కొడుకు కార్తిక్ దగ్గర మాట తీసుకుంటాడు రత్నస్వామి. తండ్రి ఇచ్చిన ఫోటో పట్టుకొని ఆముద కొడుకు సచిన్ (యోగిబాబు)ను కలుసుకుంటాడు కార్తిక్. సచిన్ చెన్నైలో ఇడ్లీ బండి నడుపుతుంటాడు. అతను చేసే చట్నీ అక్కడ ఫేమస్. కార్తీక్, సచిన్ తో జరిగిందంతా చెప్తాడు. చిన్నప్పటినుంచి ఒంటరిగా పెరిగిన సచిన్ తనతండ్రిపై పీకల్లోతు కోపాన్ని పెంచుకొనివుంటాడు. తండ్రిని కలిసే ఉద్దేశమే తనకి లేదని తేల్చిచెప్పేస్తాడు. సచిన్ ఎంతకీ మెత్తపడకపోడంతో ఓ రాత్రి ఫుల్లుగా తాగించి కిడ్నాప్ చేసి ఊటీకి తీసుకెళ్ళిపోతారు. తర్వాత ఏం జరిగింది? సచిన్ తండ్రిని కలిశాడా? సచిన్ గురించి తెలుసుకున్న రత్నస్వామి కుటుంబం ఎలా రియాక్ట్ అయ్యింది? అసలు రత్నస్వామి ఆముద విడిపోవడానికి కారణం ఏమిటి? తండ్రి మీద సచిన్ కి కోపం తగ్గిందా? ఈ కథలో సోఫీ పాత్ర ఏమిటి? కార్తిక్ ప్రేమకథలో సచిన్ ఎలాంటి పాత్ర పోషించాడు? ఇదంతా మిగతా సిరిస్.
Also Read : ‘సావి’ రివ్యూ: జైలు నుంచి తప్పించుకోవడం ఎలా?
యోగిబాబు అనగానే కామెడీ అని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఐతే దర్శకుడు రాధమోహన్ కొంచెం కొత్తగా అలోచించాడు. యోగిబాబుతో ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీయాలనేది ఆయన ఆలోచన. దానికి తగ్గట్టే ఈ కథ తయారు చేసుకున్నారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్ (ఒకొక్క ఎపిసోడ్ నిడివి 40నిమిషాల లోపే) వున్న ఈ సిరిస్ ని కామెడీ కోణంలో కాకుండా ఒక ఫ్యామిలీ కథలా చూస్తే మాత్రం ఎక్కువ మసాలాలు లేని పసందైన వంటకం రుచి చూసిన అనుభూతిని ఇస్తుంది.
అముద కేఫ్ లో సాంబార్ ప్రత్యేకతని పరిచయం చేస్తూ కథ మొదలౌతుంది. కాసేపటి కథ పూర్తిగా ఫ్యామిలీ టర్న్ తీసుకుంటుంది. రత్నస్వామి, కార్తిక్, ఆముద, బావ ఎలాంగో, సోఫీ పాత్రలు లైవ్లీ గా కనిపిస్తాయి. యోగి పాత్ర పరిచయం, ఆ ఇడ్లీ బండీ, తనకే సొంతమైన చట్నీ ఫార్ములా.. ఇవన్నీ గమ్మత్తుగా వుంటాయి. కథ కంటే ఇందులో సచిన్, కార్తిక్, బావ ఎలాంగో పాత్రలని తీర్చిదిద్దిన విదానం భలే వినోదాత్మకంగా వుంటుంది.
సచిన్ ఊటీకి వచ్చిన తర్వాత చోటు చేసుకునే సన్నివేశాలు నవ్విస్తూనే చిన్న ఎమోషన్ ని కలిగిస్తాయి. సచిన్ పాత్ర పరిస్థితులని ఎదుర్కునే విధానం, తన అలోచన తీరు నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. జీవితాన్ని ప్రతిదశలో నవ్వుతూ తీసుకునే పాత్ర అది. చివరికి తండ్రి అస్థికలు గంగలో కలిపినప్పుడు కూడా తన నుంచి వచ్చే డైలాగులు రొటీన్ గా కాకుండా జీవితసారాన్ని ఒడిసిపట్టిన ఓ వ్యక్తి ఎంత తేలిగ్గా ఉంటాడో అలానే వ్యవహరిస్తాడు సచిన్.
కార్తిక్ కుటుంబంతో తను కలిసి విధానం కూడా చాలా పరిణితితో వుంటుంది. అలాగే ఈ కథలో మరో కీలకమైన కోణం కార్తిక్ ప్రేమకథ. ఈ కథకి సచిన్ ఫ్లాష్ బ్యాక్ తో ముడిపెట్టిన తీరు కథకుడి ప్రతిభకు అద్దంపడుతుంది. నిజానికి ఫ్యామిలీ కథలని హృద్యంగా చెప్పాలంటే ఓ మనిషినే ఆసరాగా చేసుకోవాలి. దర్శకుడు కూడా అదే చేశాడు. మానసిక సంఘర్షణ, భావోద్వేగం ఇవన్నీ సహజంగా పట్టుకున్నాడు. అయితే ఇందులో మైనస్సులు కూడా లేకపోలేదు. వాణీ భోజన్ ట్రాక్ అంతగా పండలేదు. మూడు, నాలుగు ఎపిసోడ్స్ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. చాలా చోట్ల ఫిలాసాఫికల్ కామెడీ వుంటుంది. దాని డీప్ లేయర్ అర్ధమైతేనే నవ్వొస్తుంది.
Also Read :‘రాయన్’ రివ్యూ: ఎవరూ రాయని కథ కాదు!
యోగిబాబు స్క్రీన్ ప్రజెన్స్ ఈ సిరిస్ కి ప్రధాన ఆకర్షణ. కేవలం నవ్వించడమే కాకుండా ఒక మంచి ఫ్యామిలీ కథ చెప్పాలనే ఉద్దేశంతో ఆయన చేసిన సిరిస్ ఇది. చాలా చోట్ల తన సింగిల్ లైనర్స్ తో నవ్విస్తాడు. సీన్ రొటీన్ గా వున్నప్పుడు తనపై తానే ఓ జోక్ పెల్చేస్తాడు. ఆముద, చిన్నప్పుడు సచిన్ గా చేసిన నటీనటులు ట్రాక్ కూడా చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. సొంతకాళ్ళపై నిలబడాలనే సచిన్ మనస్తత్వం స్ఫూర్తిదాయకంగా వుంటుంది. కార్తిక్ పాత్రలో చేసిన చంద్రన్ యాక్టింగ్ డీసెంట్ గా వుంటుంది. చాలా పాజిటివ్ రోల్ అది. ఇక ఇల్లరికం వున్న బావ పాత్రలో చేసిన నటుడు భలే నవ్విస్తాడు. చాలా మంది రిలేట్ చేసుకునే బావ పాత్ర అది. నిళల్ గల్ రవి, వాణీ భోజన్, దీపా శంకర్, నందిని మిగతా పాత్రలన్నీ డీసెంట్ గా వుంటాయి.
సిరిస్ అంతా ఊటీలో తీశారు. చూడటానికి హాయిగా వుంటుంది. నేపధ్య సంగీతం, కెమరాపనితనం చక్కగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. యోగిబాబుకి రాసిన సింగిల్ లైన్స్ నవ్విస్తాయి. సరదాగా ఫ్యామిలీ అంతా కలసి ఏదైనా కంటెంట్ చూడాలనుకుంటే ఈ చట్నీ సాంబార్ రుచి చూడాల్సిందే. అద్భుతం అనిపించకపోయినా బావుందనే ఫీలింగ్ కలిగించే సిరిస్ ఇది.