ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారంటే ఏంటో వైసీపీ సోషల్ మీడియా, వాటి ఇంచార్జ్ సజ్జల భార్గవను చూస్తే అర్థమైపోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై కేసులు పెట్టించడంలో సక్సెస్ అయ్యారు. కానీ తాము అంత కంటే ఘోరం చేస్తున్నా… తమను ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్నారు. కానీ ఈసీ అధికారులు సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపైనా కేసులు పెట్టాలని సీఐడీని ఆదేశించారు. నాలుగైదు రోజులు నసిగిన సీఐడీ అధికారులు.. చివరికి తప్పని పరిస్థితుల్లో కేసులు పెట్టారు.
పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఇంటలిజెన్స్ ను కూడా వాడుకుంటూ ఓ ఫేక్ వ్యవస్థను సృష్టించారు. ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు వార్తలతో విరుచుకుపడుతున్నారు. వారి ఘోరాలకు హద్దే లేకుండా పోతోంది. ఇతర పార్టీల వాళ్లు ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అర్థరాత్రి వారి ఇళ్లపైకి పోలీసుల్ని పంపేవారు. ఇప్పుడు వారు అధికారంలో ఉండగానే సీఐడీ కేసులు పెట్టేసింది.
ఎన్నికలు అయ్యే వరకూ సజ్జల భార్గవకు, ఆ పార్టీ సోషల్ మీడియాకు పెద్దగా సమస్యలేమీ ఉండకపోవచ్చు. కానీ జూన్ నాలుగో తేదీ తర్వాత అసలు సినిమా ప్రారంభణయ్యే చాన్స్ ఉంది. సోషల్ మీడియా అరాచకాలు మొత్తం బయటకు తీయడానికి ఈ కేసు సరిపోతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పెట్టిందని ఆరోపించడానికీ చాన్స్ లేదు. వైసీపీ హయాంలోనే నమోదైంది. అందుకే ఆట మొదలైందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.