రఘురామకృష్ణరాజు ఇష్యూపై సీఐడీ అధికారులు రెండో సారి ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. కొద్దిరోజుల కిందట.. ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికలో రఘురామకృష్ణరాజు కాలికి గాయాలు ఉన్నట్లు చెప్పలేదని నివేదికను ప్రకటించిన సీఐడీ అధికారులు.. తాజాగా ఆయన ఫోన్ గురించి చేసిన ఆరోపణలపై స్పందించారు. రఘురామకృష్ణరాజు ఫోన్‌ను.. సిమ్‌ను అరెస్ట్ చేసిన రోజే సీజ్ చేశామని ప్రకటించారు. ఈ మేరకు సీజర్ రిపోర్ట్ కూడా తయారు చేశామన్నారు. ఫోన్‌ను సీఐడీ కోర్టులో డిపాజిట్ చేశామని ప్రెస్‌నోట్‌లో తెలిపారు. ఫోన్, సిమ్ అన్నీ సీజ్ చేశామని .. సీఐడీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పుడు అసలు విషయం.. ఆ ఫోన్ నుంచి ఎవరెవరికి సందేశాలు వెళ్లాయో తేలాల్సి ఉంది. రఘురామకృష్ణరాజు ఫోన్ నుంచి.. పీవీ రమేష్ సోదరితో పాటు..ఆయన కుటుంబసభ్యులకు సందేశాలు వెళ్లాయని ఆయనే స్వయంగా ట్విట్టర్లో తెలిపారు. దీంతో ఈ వివాదం ఆసక్తికర మలుపు తిరిగింది. ఒక్క పీవీ రమేష్ సోదరికే కాదు.. ఇంకా చాలా మందికి సందేశాలు వెళ్లాయని.. రఘురామకృష్ణరాజు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపధ్యంలోనే సీఐడీ పోలీసులు స్పందించినట్లుగా తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు తన ఫోన్ నెంబర్‌ను 9000911111గా చెప్పారని.. ఆ నెంబర్ సిమ్ అందులో ఉందో లేదో తమకు తెలియదని సీఐడీ చెప్పుకొచ్చింది.
నిజానికి.. కేసు నమోదు చేసినప్పుడు.. పోలీసులు నిందితుడితో పాటు.. అతని వద్ద నుంచి తీసుకున్న వస్తువులన్నింటినీ సాక్షుల సమక్షంలో పంచనామా చేసి.. కోర్టులో సమర్పించాలి. ఫోన్ తమ దగ్గరే ఉందని.. సీజ్ చేశామని.. సీఐడీ చెప్పినందు వల్ల.. తదపరి పరిణామాలు వేగంగా సాగే అవకాశం ఉంది. ఈ వ్యవహారం ముందు ముందు సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఫోన్ నుంచి పీవీ రమేష్ సోదరికి సందేశాలు ఎలా వెళ్లాయి… ఎవరు పంపారు.. అసలు ఎప్పుడు సీజ్ చేశారు.. ఎప్పుడు కోర్టుకు సమర్పించారు.. ఎప్పుడు ఆ ఫోన్ నుంచి సందేశాలు వెళ్లాయో.. లెక్క తేలిస్తే.. సీఐడీ అధికారులపై రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణల్లో నిజం నిగ్గుతేలిపోయే అవకాశం ఉంది.