హైకోర్టు, న్యాయమూర్తులపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారి విషయంలో విచారణ పూర్తి చేశామని.. త్వరలోనే చార్జిషీటు దాఖలు చేస్తామని సీఐడీ అధికారులు.. హైకోర్టుకు తెలిపారు. గతంలో ఈ అంశంపై హైకోర్టు మేనెలలో రెండు విడతలుగా 93 మందికి నోటీసులు పంపింది. ఇందులో గుడివాడ అమర్నాథ్, కొమ్మినేని శ్రీనివాస్, కత్తి మహేష్ లాంటి వాళ్లు ఉన్నారు. అప్పట్లో కేసులు నమోదు చేసిన సీఐడీ..విచారణ ప్రారంభించింది. ఏ ఒక్కరిని కూడా ప్రశ్నించడం కానీ.. నోటీసులు జారీ చేసి.. వివరణ తీసుకోవడం కానీ.. అరెస్టులు చేయడం కానీ చేయలేదు. తాజాగా.. హైకోర్టులో ఈ అంశంపై విచారణకు వచ్చే సరికి.. ఇప్పటికే విచారణ పూర్తయిందని, ఛార్జిషీట్‌ను సిద్ధం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. హైకోర్టు పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని సీఐడీ అధికారులను ఆదేశించి రెండు వారాలకు వాయిదా వేసింది.
వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైనా… టీడీపీ వారిపై చిన్న ఫిర్యాదు చేస్తే.. హుటాహుటిన వెళ్లి వారిని అరెస్ట్ చేసి.. ధర్డ్ డిగ్రీ ప్రయోగించడంలో ముందుండే ఏపీ పోలీసులు.. హైకోర్టు గౌరవాన్ని కాపాడే విషయంలో మాత్రం.. అంత చురుగ్గా ఉండటం లేదు. న్యాయవ్యవస్థపై దారుమమైన వ్యాఖ్యలు చేసినా…స్వయంగా కోర్టు నోటీసులు జారీ చేసిందే తప్ప.. సీఐడీ స్పందించలేదు. హైకోర్టుపై వ్యాఖ్యలు చేసిన వారందరికీ తాము అండగా ఉంటామని.. స్వయంగా విజయసాయిరెడ్డి ప్రకటించడంతో… పోలీసులు కూడా అడుగు ముందుకు వేయలేనట్లుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనుకూలంగా తీర్పులివ్వకపోతే.. న్యాయవ్యవస్థను సైతం బ్లాక్ మెయిల్ చేసేలా.. కుల, మత, ప్రాంతాలను న్యాయమూర్తులకు ఆపాదిస్తూ.. గతంలో వందల మంది పోస్టులు పెట్టారు. చివరికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ కూడా… కామెంట్లు చేశారు. కొమ్మినేని లాంటి వారు సాక్షి టీవీలో కాకుండా… వేరే యూ ట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చి మరీ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ రెండు వారాల తర్వాత విచారణకు వచ్చే సరికి.. పోలీసులు ఇంకేం చెబుతారో కానీ… వారందరికీ.. తాము అండగా ఉంటామని వైసీపీ చెప్పినందున.. పోలీసులు ఏదో కారణం చెప్పడమే తప్ప… న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయరన్న అభిప్రాయాలు న్యాయవాద వర్గాల్లో వినిపిస్తున్నాయి.