వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఐదు రోజులుగా పులివెందులలో మకాం వేశారు. గతంలో రెండు సార్లు వచ్చారు. వెళ్లారు. ఇప్పుడు మూడో సారి వచ్చారు. ఈ మూడో సారి వచ్చినప్పుడు కూడా.. మొదటి రెండు సార్లు ఏం చేశారో అదే చేస్తున్నారు. మొదటగా… వివేకా హత్యకు గురైన ప్రాంతాన్ని మూడు గంటల పాటు పరిశీలించారు. చాలా సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లుగా.. మళ్లీ టేపులు .. గట్రా.. తెప్పించుకుని కొలతలు తీసుకున్నారు. ఆ తర్వాత వీధి చివరన ఉన్న కిళ్లీ బంకు.. పాలు పోసే వ్యక్తి.. ఇలా… పాత సీరియల్ ప్రకారం… అందర్నీ పిలిచి ప్రశ్నిస్తున్నారు. నాలుగో రోజు వివేకా పీఏ కృష్ణారెడ్డిని మరికొంత మందిని కూడా ప్రశ్నించినట్లుగా కూడా మీడియాకు సమాచారం ఇచ్చారు.
సీబీఐ అధికారుల విచారణ తీరు చూసి… ఒక్క పులివెందుల వాసులే కాదు… రాష్ట్రం మొత్తం ముక్కున వేలేసుకుంటుంది. వివేకా హత్య కేసులో ఎన్నో క్లూలు ఉన్నాయి. క్రైమ్ లెక్కల్లో సాక్ష్యాలు తుడిచేయడానికి ప్రయత్నించిన వారే.. మొదటి అనుమానితులు. హత్యను దాచి పెట్టడానికి ప్రయత్నించిన వారికి మొత్తం తెలిసే ఉంటుంది. మొదట గుండెటపోటు అని నమ్మంచడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా.. గుండెపోటుతో మరణించారని.. ఉదయం పది గంటల సమయంలో ప్రకటించింది. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయిన వివేకానందరెడ్డికి సంతాపం ప్రకటంచారు. అయితే.. అసలేం జరిగిందో.. కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వలేదు. కానీ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ వివేకా.. అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని.. ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది.
డెడ్‌బాడీ పోస్టుమార్టానికి వెళ్లే వరకూ… ఎవరూ… ఆయనది హత్య అని అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఈ లోపే సాక్ష్యాలు తుడిచేయడం… వివేకా గాయాలు కనిపించకుండా కట్లు కట్టడం లాంటివి చాలా చేశారు. హత్యను దాచి పెట్టి… సాక్ష్యాలను తారుమారు చేసి… స్మూత్‌గా… అంత్యక్రియలు జరిపించేయాలని… ప్రయత్నించారనేది బహిరంగరహస్యం. అత్యంత దారుణంగా నరికేసినట్లుగా తేలడంతో.. ఇక హత్య అని ఒప్పుకోక తప్పలేదు. ఇంత స్పష్టంగా సీక్వెన్స్ ఉన్నప్పటికీ..సీబీఐ అధికారులు.. పాల వాళ్లను.. పని వాళ్లను ప్రశ్నించి సమయం వృధా చేసుకుంటున్నారు కానీ… సాక్ష్యాలను మాయం చేసిన వారిని.. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్న వారిని మాత్రం… ఇంత వరకూ ప్రశ్నించడానికి సిద్ధపడలేదు.
సీబీఐ అధికారుల కంటే.. టీవీల్లో వచ్చే సీఐడీ సీరియల్లోని టీం సమర్థంగా పని చేస్తుందని… ఏపీ ప్రజలు సెటైర్లు వేసుకుంటూంటే… అది వారి తప్పు కాదు. నిందితుల్ని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టాల్సిన సీబీఐ రాజకీయ ఒత్తిళ్లకో.. ప్రలోభాలకో లోనై దర్యాప్తు చేస్తున్నట్లుగా నాటకాలాడి ఎవర్నో మభ్యపెట్టాలనుకోవడంలోనే తప్పు ఉంది. ఈ విషయాన్ని సీబీఐ పెద్దలు గుర్తిస్తారో లేదో..?