జత్వానీ కేసులో ఐపీఎస్ ఆఫీసర్లకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. పోలీసులుగా ఉండి వారు చేసిన పని వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గించేలా ఉందని.. అన్ని రకాల గీతలు దాటేశారని సీఐడీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జత్వానీకేసు బయట పడి నెలలు గడుస్తున్నాయి. ఒక్క విద్యాసాగర్ ను అరెస్టు చేశారు తప్ప కుట్ర దారుల్ని అరెస్టు చేయలేదు. దారి తప్పిన పోలీసుల్ని.. మాఫియాగా మారి ఓ మహిళను.. ఆమె కుటుంబాన్ని అక్రమంగా అరెస్టు చేసేందుకు పెద్ద ఆపరేషన్ నిర్వహించి పోలీసు పవర్స్ ను దుర్వినియోగం చేశారు.
జత్వానీ అనే మహిళ ఎలాంటి తప్పు చేయలేదని ముందుగానే తేలిపోయింది. ఇక్కడ కేసు పెట్టేంత తప్పు ఆమె ఏమీ చేయలేదు. విద్యాసాగర్ భూమిని కబ్జా చేయలేదు. దాన్ని అమ్మేందుకు ప్రయత్నం చేయలేదు. ఆమెను ఇరికించడానికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి..ఆమె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. అంతా బహిరంగమే. ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుందో ఆ పోలీసులకే తెలియాలి. తమ వ్యవస్థలోని వారే కాబట్టి వారిని కాపాడాలని అనుకుంటున్నారేమో తెలియదు.
ఇప్పటికైతే బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ దాఖలు చేశారు. వారికి ముందస్తు బెయిల్ కోర్టు ఇవ్వకపోయినా వారు సుప్రీంకోర్టుకు వెళ్తారు. అక్కడ వారికి ఊరట లభిస్తుందో లేదో తెలియదు కానీ.. వారు చేసిన నేరాలు మాత్రం చిన్న చిన్నవి కాదు.వారి ఘోరాలకు ఎక్కువగా బాధితులైన వారు అధికారంలో ఉన్నారు అయినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో వారికే తెలియలి. కానీ పోలీసులకు శిక్ష పడకపోతే… వారు చేసిన తప్పు ఎంత తీవ్రమైనదో నిరూపించకపోతే వ్యవస్థ మాత్రం ఇంకా పూర్తిగా దారి తప్పుతుంది. దానికి రాజకీయ వ్యవస్థ కూడా తర్వాత బాధితురాలవుతుంది. ఇక ప్రజల సంగతి చెప్పాల్సిన పని లేదు.