అమరావతి భూముల కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరుపాలంటూ.. సీఐడి అధికారులు ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాశారు. నేరుగా.. ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ లేఖ పంపారు. అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 2018 నుంచి 2019 వరకు 106 మంది నుంచి కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని అందులో కోరారు. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ రూ.2 లక్షలకు మించి జరిగిన ట్రాన్సాక్షన్లపై విచారణ జరపాలన్నారు. మొత్తం 106 మంది అసైన్డ్ భూముల కొనుగోలులో ఉన్న వ్యక్తుల పూర్తి వివరాలు…ల్యాండ్ అడ్రస్‌లు, సర్వే నెంబర్లతో సహా ఐటీ చీఫ్ కమీషనర్‌కు పంపిన సీఐడీ… చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజధానిగా ప్రకటించిన తర్వాత అమరావతిలో టీడీపీ నేతల వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని.. వైసీపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా… ఆ ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బయట పెట్టలేకపోయారు. మంత్రి వర్గ ఉపసంఘం, విజిలెన్స్, సీఐడీ సహా… ఏపీ ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని దర్యాప్తు సంస్థల్నీ ఉపయోగించారు. చివరికి ఎవరికి ఏమున్నాయో తేల్చలేకపోయారు. ఫైనల్ గా… భూ లావాదేవీలు జరిపిన వారిలో తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారని.. నెలకు నాలుగైదు వేల ఆదాయం లోపు ఉన్న వారు.. లక్షలు పెట్టి ఎలా భూములు కొనుగోలు చేశారన్న కోణంలో.. విచారణ చేస్తున్నారు.
ఇందులోనూ సీఐడీ అధికారులకు ఏమీ దొరకలేదో.. సమాచారం అందలేదో కానీ.. ఐటీ అధికారులకు లేఖ రాశారు. ఐటీ అధికారులు మహా అయితే… ఆ కొనుగోళ్లు చేసిన వారు పన్నుల్లో చూపించని ఆదాయంతో కొనుగోలు చేశారని భావిస్తే…జరిమానా విధిస్తారు కానీ.. భూముల లావాదేవీలు అక్రమలా.. సక్రమమా అన్నవి చూడరు. సీఐడీ మాత్రం… లేఖ రాసి.. చర్యలు తీసుకోవాలంటోంది.