కోర్టులు చీవాట్లు పెట్టినా … రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని.. చట్టాన్ని అతిక్రమిస్తున్నారని.. ప్రైవేటు సైన్యం మాదిరిగా ప్రవర్తిస్తున్నారని తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నా ఏపీసీఐడీ అధికారులు మాత్రం మాత్రం మారడం లేదు. తాజాగా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఉంటున్న హైదరాబాద్ ఇంట్లో హడావుడి చేశారు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నారన్న సమాచారం తెలుసుకున్నారేమో కానీ ఓ పది మంది వరకూ సీఐడీ పోలీసులు చింతకాయల విజయ్ ఇంట్లోకి చొరబడ్డారు. కానీ ఆయన లేరు.
దీంతో ఆయన పిల్లలను .. ప్రశ్నించి.. సర్వెంట్‌ను అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. పిల్లల ఫోటోలు తీసుకోవడం హడావుడి చేయడంతో చుట్టుపక్కల ఫ్లాట్ల వాళ్లు ప్రశ్నించడంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఎందుకు వచ్చారో.. ఏ కేసు విషయంలో వచ్చారో కూడా స్పష్టత లేకపోవడంతో టీడీపీ నేతలు మండిపడ్డారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగల్లా వ్యవహరిస్తున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు.
బెదిరిస్తే వెనక్కి తగ్గే వాళ్లం కాదని పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని.. పిల్లలను ప్రశ్నించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. కోర్టుల్లో న్యాయమూర్తులు చీవాట్లు పెట్టినా సరే… రిమాండ్‌కు అంగీకరించకపోయినా సరే అరెస్ట్ చేసి ఒకరోజు కస్టడీలో ఉంచుకుని కొడితే చాలన్నట్లుగా సీఐడీ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఇలాంటి వాటి వల్లే వస్తున్నాయి.