మద్యం స్కాంపై మిథున్ రెడ్డి ఇంత కొట్టేశాడని .. ఇది సీఐడీ దర్యాప్తులో తేలిందని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇలా చెప్పాల్సింది టీడీపీ సోషల్ మీడియా కాదు. సీఐడీ. చెప్పడానికన్నా ముందు చర్యలు తీసుకోవాల్సి ఉంది. మద్యం స్కాంలో ఇప్పటి వరకూ విచారణ ఎంత వరకూ వచ్చిందో ఎవరికీ తెలియదు. వాసుదేవరెడ్డి అనే అధికారిని ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. ఆయనను అరెస్టు చేయకుండా ఎలాంటి ఆదేశాలు కూడా లేవు.
ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా అతి పెద్ద స్కాం అని కూటమి పార్టీలన్నీ చెబుతూ వచ్చాయి. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కూడా ఇంకా పార్టీ హ్యాండిళ్లలో వారు ఇంత వసూలు చేశారు..అంత వసూలు చేశారు అని చెప్పడం కన్నా చట్టపరమైన చర్యలు… ఎందుకు తీసుకోలేకపోతున్నారో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.
మద్యం స్కాం అనేది ఏపీలో వైసీపీ హయాంలో కళ్ల ముందే జరిగింది. జే బ్రాండ్ లిక్కర్లు, నగదు లావాదేవీలు, వైసీపీ కార్యకర్తల చేతుల్లో దుకాణాలు, ఎంత అనధికార మద్యం అమ్మారో.. ఎంత తయారు చేశారో.. కూడా లెక్కలు తీశారు. ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదో మాత్రం.. ఎవరికీ అర్థం కావడం లేదు. ఈడీకి ఇస్తామని చెప్పారు. అది కూడా ముందుకు పడటం లేదు. విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీనే ఎక్కువగా లాభపడిందని టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించింది. అప్పట్లో ఆనం వెంకటరమణారెడ్డి బయట పెట్టిన డీటైల్స్ తో తీగ లాగితే మొత్తం దొరికిపోతుంది. ఎందుకు ఆలోచిస్తున్నారో ప్రభుత్వానికి.. టీడీపీ నేతలకే తెలియాలి!