టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్ని ఇక నుంచి సీఐడీ డీల్ చేయనుంది. ఇప్పటి వరకూ ఆయా పోలీస్ స్టేషన్లలో కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారిపై ఉండే ఇతర కేసుల భారం కారణంగా విచారణ ఆలస్యం అవుతోంది. ఈ లోపు నిందితులు ముందస్తు బెయిల్స్ కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్తున్నారు. కేసుల్లో ఉన్న తీవ్రత దృష్ట్యా వాటిని సీఐడీకి బదిలీ చేస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ ఆఫీసుపై దాడి అత్యంత తీవ్రమైనది. కుట్రపూరితంగా గుంపును పంపి దాడి చేయించారు. ఆ దృశ్యాలన్నింటినీ సీసీ కెమెరాల దృశ్యాలున్నాయి. వారిని దాడికి పంపింది దేవినేని అవినాష్ , అప్పిరెడ్డి అని గుర్తించారు. వారిద్దరూ టీడీపీ ఆఫీసుకు సమీపంలోనే ఉండి దాడిలో పాల్గొన్న వారికి ఆదేశాలిచ్చారు. కాల్ రికార్డులు సహా సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసులు పెట్టారు. చంద్రబాబు ఇంటిపై దాడికి మాజీ మంత్రి జోగి రమేష్ ప్రణాళిక ప్రకారం వచ్చారు. దాడికి వచ్చిన వారంతా జోగి రమేష్ కుట్రల్ని పోలీసులకు వివరించారు.
ఈ రెండు కేసుల్లో ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. విచారణకు సహకరిస్తామని చెప్పి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్స్ తెచ్చుకున్నారు. ఈ కేసుల్లో సీఐడీ మిగతా విచారణ పూర్తి చేసి నిందితుల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ రెండు కేసులు సీఐడీకి వెళ్లడంతో … ఆ దాడుల మాస్టర్ మైండ్లకు కొత్త టెన్షన్ ప్రారంభమయిందని అనుకోవచ్చు.