టీడీపీ నేత నారాయణను సీఐడీ వెంటాడుతోంది. ఆయన అమెరికా వెళ్లి తీవ్ర అనారోగ్యానికి ఆపరేషన్ చేయించుకుని వచ్చారని తెలిసి కూడా ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ కేసులో 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు హైదరాబాద్ లోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీ సీఐడీ అధికారులను ఆదేశించింది. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది మే 10వ తేదీన మాజీ సీఎం చంద్రబాబునాయుడుసహా మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ-1గా, నారాయణను -2 గా సీఐడీ చేర్చింది. అసలు ఇన్నర్ రింగ్‌రోడ్డే లేదని.. ఇక అలైన్మెంట్ మార్పు ఎక్కడిదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క గజం కూడా భూసేకరణ జరగని ప్రాజెక్టులో అవకతవకలు ఏమిటని ప్రశ్నిస్తోంది. అయితే ఈ కేసులో చంద్రబాబుకు ఇంత వరకూ నోటీసులు ఇవ్వలేదు. కానీ నారాయణ వెంట పడుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
అయితే ఈ ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలనిసుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో ఏపీ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఇప్పుడు ఆ కేసులోనే సీఐడీ నోటీసులు ఇచ్చింది. మరో వైపు నారాయణపై దాఖలు చేసిన టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో నారాయణకు దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను చిత్తూరు జిల్లా కోర్టు రద్దు చేసింది. నెలాఖరులోపు ఆయన కోర్టులో లొంగిపోవాల్సిఉంది.