విజయమ్మ, షర్మిల.. ఇప్పుడు శైలజా కిరణ్. ఈ సిరీస్ కాస్త విచిత్రంగా ఉండవచ్చు కానీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు, అధికార అహం కోసం తన, మన అనే తేడా లేకుండా ఎవరినైనా వేధించగల మనస్థత్వానికి వీరు బాధితులు అనుకోవచ్చు. మార్గదర్శి కైసులో శైలజా కిరణ్కు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆరో తేదీన ఆమెను ప్రశ్నిస్తారు. రామోజీరావును ప్రశ్నించినప్పుడు ఫోటోలు, వీడియోలు ప్రచారం చేసుకున్నట్లే ఆమె ఫోటోలు ప్రచారం చేసుకుని పైశాచిక ఆనందం పొందుతారు. ఇదంతా కామన్. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ఆ శైలజా కిరణ్ కొన్నాళ్ల కిందట వారికి చేసిన మేలు గురించి వారికి గుర్తు లేకపోవడం.
బయటకు తెలియదు కానీ కార్పొరేట్ ప్రపంచంలో అందరికీ తెలుసు.. శైలజా కిరణ్, వైఎస్ భారతి రెడ్డి స్నేహితులు. పలు కార్యక్రమాల్లో తరచూ కలుస్తూ ఉంటారు. వారి మధ్య మంచి బాండింగ్ ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఓ పెళ్లిలో రామోజీరావును జగన్ అతి మర్యాదగా పలకరించిన తర్వాత భూమన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు భూమనతో పాటు జగన్ కూడా వెళ్లారు. ఇలా రామోజీ ఇంట్లోకి జగన్ కు ఎంట్రీ లభించడానికి కారణం శైలజాకిరణ్ మధ్యవర్తిత్వం. అలా వెళ్లి కాస్త పరిచయం పెంచుకుని 2019 ఎన్నికలకు ముందు రాజీ చేసుకుని వ్యతిరేక వార్తలు రాకుండా కాస్త సంయమనం పాటించేలా చూసుకున్నారు. గత ఎన్నికలకు ముందు ఈనాడు ఎన్నికల కవరేజీని చూస్తే.. చంద్రబాబు పాలనలో ప్లస్ పాయింట్లు చెప్పి ఉంటారు కానీ.. జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారమూ జరగలేదు. అది జగన్కు ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పుడు అంత సాయం చేసిన శైలజా కిరణ్ పై సీఐడీని ప్రయోగిస్తున్నారు ఆది దంపతులు. నిజంగా అందులో తప్పులు జరిగి ఉంటే.. అనుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా కక్ష పూరితంగా ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించాలన్న లక్ష్యంతోనే ఈ కేసులు పెట్టారని చిన్న పిల్లవాడికి తెలుసు. ఓ వైపు అగ్రిగోల్డ్ బాధితులు లక్షల మంది ఉన్నారు.. ఇటీవల పలు కంపెనీలు బోర్డు తిప్పేశాయి. ఇంకా అనేక కంపెనీలు చట్ట విరుద్ధంగా నడుస్తున్నాయి. వాటి జోలికివెళ్లలేదు. కానీ పక్కాగా నిబంధనలు పాటించే కంపెనీ అయిన మార్గదర్శిపై కక్ష గట్టి చేయాల్సినదంతా చేస్తున్నారు. మంచి చేసిన స్నేహితురురాల్ని వదిలి పెట్టడం లేదు.
అయితే సొంత కుటుంబాన్నే వదల్లేదు ఇక స్నేహితురాలా అని సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం కావొచ్చు కానీ.. ఇంత దారుణమైన మనస్థత్వం ఎలా అని . విస్మయానికి గురయ్యేవారే ఎక్కువ. రాజకీయం రాజకీయంగా చేసుకోవాలి. రాజకీయ శత్రువులు వ్యక్తిగత శత్రువులే అనుకుంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి.