బీజేపీ సినీ గ్లామర్ ని కోరుకుంటోంది. మరీ ప్రత్యేకించి మాజీ హీరోయిన్స్ ని ఆకట్టుకుంటోంది. తమిళనాట ఒకనాటి హీరోయిన్ ఖుష్బూ 2020 లోనూ, తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల తర్వాత రాములమ్మ కాషాయ తీర్ధం పుచ్చుకోగా…ప్రస్తుతం మరికొంతమంది హీరోయిన్స్ ఆ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.
ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలని కలలు కంటున్నా వాణి విశ్వనాధ్ మొదట తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా నియమితులవుతారని కధనాలు వచ్చాయి. ఆమె స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని ధృవీకరించింది కూడా. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ…ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆమె కాషాయ జెండా నీడకు చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది.
ప్రియరామన్ కూడా ఒకనాడు విజయవంతమైన హీరోయిన్. ప్రస్తుతం ఏం చేస్తుందో తెలీని స్థితిలో హఠాత్తుగా ఆమె పేరు బీజేపీతో ముడిపెడుతూ ప్రచారంలోకి వచ్చింది. అర్చన అనే ఇంకో హీరోయిన్ కూడా అదే పార్టీలో చేరాలని కుతూహల పడుతున్నారు.
తాను కూడా కాషాయ తీర్ధం పుచ్చుకునేందుకు ఉత్సాహపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోయిన్స్ బిజెపి నేత సత్యమూర్తి ని కలుసుకుని తమ చేరిక విషయమై ప్రాధమికంగా చర్చించారట. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కలసిన తరువాతఃపార్టీ తీర్ధం పుచ్చుకోవచ్చని చెప్పారట.
త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి విజయానికి ప్రచారం చేయమంటూ సూచించారట. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారని తెలుస్తోంది.