కథలెలా పుడతాయి. గాల్లో మాత్రం కాదు. అక్కడ తప్ప.. ఎక్కడైనా పుట్టొచ్చు. కొన్ని కథలు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. `సినిమా బండి` ట్రైలర్ చూస్తే.. ఆ గమ్మత్తేమిటో అర్థమవుతుంది. `సినిమా బండి` మే 14న నెట్ ఫ్లిక్స్‌లో విడుదల అవుతున్న చిన్న సినిమా. ఇందులో స్టార్లు లేరు. తెలుగు వారికి సుపరిచితమైన దర్శకులు, `ది ఫ్యామిలీ మెన్`కి కర్త కర్మ క్రియ అయిన రాజ్ డీకే ఈ చిత్రానికి నిర్మాతలు. వాళ్లు స్టార్లు లేకుండా సినిమా తీశారంటే, కథని ఎంతగా నమ్మారో అర్థం అవుతుంది.
`సినిమా బండి` ట్రైలర్.. ఈరోజు విడుదలైంది. అది చూస్తే ఆ గమ్మత్తేమిటో అర్థం అవుతుంది. ఓ ఆటోడ్రైవర్‌కి ఓ కెమెరా దొరుకుతుంది. దాంతో సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వస్తుంది. ఆ ఊర్లో.. బార్బర్ ని హీరో చేసేస్తాడు. హీరోయిన్ కోసం కూరగాయలు అమ్మే అమ్మాయి దగ్గరకు వెళ్తాడు. ఆ ఊర్లో ప్రతీదాన్నీ ఓకథగా చెప్పే.. ముసలోడ్ని కథా రచయితని చేసేస్తారు. అక్కడి నుంచి చూడాలి.. వాళ్ల పాట్లూ, ఫీట్లూ. `ప్రతీ ఒక్కడిలోనూ ఓ సినిమా మేకర్ ఉంటాడు` అన్న విషయాన్ని దర్శకుడు అంతర్లీనంగా చెప్పాలనుకున్నాడు. ఓ ఊర్లో కొంతమంది వ్యక్తులు కలిసి, ఓ సినిమా తీయాలనుకుంటే… అసలు వాళ్లకు సినిమా జ్ఞానమే లేదనుకుంటే, ఎలా ఉంటుందన్నది `సినిమా బండి` కాన్సెప్టు. ట్రైలర్ నవ్వులు పూయిస్తుంది. కచ్చితంగా కొత్త తరహా అనుభవం ఇస్తుందన్న నమ్మకం కల్పిస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.