చేతిలో కెమెరా ఉంటే… ప్రతీ ఒక్కరూ పీసీ శ్రీరాముల్సే. అది వాళ్ల తప్పేం కాదు. క్రియేటివిటీ అలా తన్నుకొచ్చేస్తుంటుంది. నిజానికి ప్రతీ ఒక్కరిలోనూ.. ఓ ఫిల్మ్‌మేకర్ దాగుంటాడు. వాడిదైన రోజున.. వాడిదైన క్షణాన… ఆ క్రియేటర్ రంకెలేస్తూ బయటకు వచ్చేస్తుంటాడు. `సినిమా బండి` కథ కూడా బహుశా అందులోంచే పుట్టిండొచ్చు. ఓ ఆటోడ్రైవర్‌కి కెమెరా దొరుకుతుంది. `ఎన్నాళ్లు ఆటోలు తిప్పుకుంటూ బతికేది. ఓ సినిమా తీసేస్తే పోలా` అనే ఐడియా వస్తుంది. అక్కడి నుంచి ఆటో కాస్త.. సినిమా కార్ వాన్గా మారిపోతుంది. ఆ తరవాతేమైందన్నదే సినిమా.
గొల్లపల్లి అనే గ్రామం అది. అక్కడ ఓ ఆటో డ్రైవర్. పొద్దుటే.. డ్యూటీకెళ్లి, సాయింత్రం ఇంటికి తిరిగొచ్చే వేళ… బ్యాక్ సీట్ లో కెమెరా కనిపిస్తుంది. ఆ ఊర్లో పెళ్ళిళ్లకు ఫొటోలు తీసే స్నేహితుడ్ని కలిసి.. `మనం ఈ కెమెరాతో సినిమా తీసేద్దాం` అని ఆఫర్ చేస్తాడు. ఆ ఊర్లో.. ఓ తాతయ్యని పట్టుకుని కథ రాయించేస్తాడు. గెడ్డాలు గీసే బార్బర్‌ని హీరో చేసేస్తారు. అలా… సినిమాకి కావల్సిన సరంజామా సిద్ధం చేస్తారు. అక్కడి నుంచి వాళ్ల పాట్లు మొదలవుతాయి. చివరికి సినిమా తీశారా? లేదా? అన్నది తెరపై చూడాలి.
చాలా సింపుల్ పాయింట్. ఆ పాయింట్ లోనే కావల్సినంత ఫన్ ఉంది. అత్యంత సహజమైన వాతావరణంలో, కెమెరాకి ఏమాత్రం అలవాటు లేని మొహాలతో, అసలు సినిమాటిక్ డ్రామా, ఎక్స్ప్రెషన్ ఏమీ అవసరం లేని సన్నివేశాలతో నింపేసిన సినిమా ఇది. కాబట్టి.. కావల్సినంత వినోదం అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. హీరో, హీరోయిన్లని వెదుకులాడే సన్నివేశం, హీరో – హీరోయిన్ ట్రైన్ ఎక్కి పారిపోవాలనుకున్న సీన్.. హీరోయిన్ మధ్యలో ఎవరితోనో లేచిపోవడం – ఇలా ఒకదాని తరవాత మరో సీన్.. ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటాయి. మరీ పొట్టలు చెక్కలయ్యే కామెడీ కాదు కానీ, సరదాగా చూడ్డానికైతే మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. సంభాషణలన్నీ అత్యంత సహజంగా ఉన్నాయి. వాటిని పలికే విధానం కూడా. సినిమాటిక్ గ్రామర్ కి దూరంగా ఉండడం వల్ల, మరింత సహజత్వం అబ్బింది. కాకపోతే కాసిన్ని బూతులు భరాయించాలంతే.
ఈ సినిమాలో కాన్లిక్ట్, ఎమోషన్, ఫన్ మొత్తం `సినిమా`నే. ఓ సినిమా తీయడం కోసం ఊరి జనాలు పడే ఆరాటం.. కదిలిస్తుంది. కెమెరా పట్టుకెళ్లిపోయిన తరవాత.. ఆ పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. చివర్లో మరో ఫన్ సీన్ తో సినిమాకి శుభం కార్డు వేశారు. `తాతయ్య.. నిజంగా ఈ కథ నువ్వే రాశావా` అని ఓ అమ్మాయి అడిగితే.. తొలిసారి మాట్లాడిన ఆ వృద్ధ రచయిత చెప్పే డైలాగ్ కి పగలబడి నవ్వాల్సిందే.
టెక్నికల్ గా ఈ సినిమా ఎలా ఉందన్నది వదిలేయండి. ఎందుకంటే.. ఈ సినిమాలో సినిమాని ఎలా తీశారో.. ఈ సినిమా కూడా అంతే సజహంగా సాగింది. పాటలు కథలో కలిసిపోయాయి. `ఈ తాత చాలా ఫ్యామస్. కాకపోతే ఎవరికీ పెద్దగా తెలీదు`, `నువ్వు ఈ ఊర్లోనే కాదు, పక్కూర్లోనూ వరల్డ్ ఫేమస్ అయిపోతావు` లాంటి సున్నితమైన చమత్కారమైన సంభాషణలు చాలా ఉన్నాయి ఇందులో. నటీనటుల్ని ఎక్కడి నుంచి వెదికిపట్టుకొచ్చారో గానీ, వాళ్లంతా అత్యంత సహజమైన రీతిలో విజృంభించారు. సినిమాటిక్ ఫేస్ ఒక్కటీ కనిపించపోవడమే విజయ రహస్యం అయిపోయింది. ఓ మంచి ఐడియా.. దాన్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేయడం, చమత్కారమైన సన్నివేశాలు పొందిగ్గా పేర్చుకోవడంతో…. సినిమా బండి టైమ్ పాస్ కి ఢోకా లేకుండా నడిచిపోతుంది.
ఫినిషింగ్ టచ్: తాత రాసిన టైటానిక్