హైదరాబాద్: ఉయ్యాల-జంపాల ఫేమ్ రాజ్ తరుణ్, అవికా గౌర్ జంటగా రూపొంది ఇటీవల విడుదలైన ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం మంచి విజయాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాంశమయింది. బాహుబలి, శ్రీమంతుడు వంటి భారీ చిత్రాల భారీ విజయాల ప్రభంజనాన్నికూడా తట్టుకుని ఈ చిన్న చిత్రం మంచి విజయం సాధించటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ సందర్భంగా ఈ చిత్రం టీమ్‌ను ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చిత్రంగురించి మాట్లాడారు. ఇది టెక్నీషియన్ల చిత్రమని అన్నారు. హీరో హీరోయిన్లు రాజ్ తరుణ్, అవికా గౌర్లతోబాటు రావు రమేష్, తోటపల్లి మధు చక్కని నటన ప్రదర్శించారని చెప్పారు. సంభాషణలు తనకు బాగా నచ్చాయంటూ రచయిత ప్రసన్న కుమార్‌ను ప్రశంసించారు. దాసరి అభినందనలు ఎంతో ఉత్తేజాన్నిచ్చాయని దర్శకుడు త్రినాథరావు అన్నారు.
ఉయ్యాల-జంపాల చిత్రం విజయం తర్వాత చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ జాగ్రత్తగా సబ్జెక్టులను ఎంచుకుని మంచి విజయం సాధించిన రాజ్ తరుణ్ నిజంగా అభినందనీయుడే. అందుకే కిక్-2 ప్రమోషన్లో రవితేజ అతనిని ప్రత్యేకంగా అభినందించటం, అది సినిమా చూపిస్త మావకు మరింత ఉపయోగపడటం జరిగాయి.