నంద్యాల రాజకీయం మరింత వేడెక్కబోతోంది. ఇప్పటికే మంత్రులూ ఎమ్మెల్యేలూ పార్టీ నేతల మోహరింపుతో ప్రచారం చేస్తున్న టీడీపీ… ఇప్పుడు నందమూరి బాలకృష్ణను ప్రచారంలోకి దించుతోంది. నంద్యాల ప్రచారానికి బాలయ్య రావాలంటూ ఈ మధ్య అభిమానులూ నియోజకవర్గ పార్టీ శ్రేణులూ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా, వైకాపాకు ధీటుగా టీడీపీ పంచ్ లు పడటం లేదన్న వెలితి నంద్యాల వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్యను ప్రచారంలోకి దించాలని నిర్ణయించారు. ఈనెల 16న ఆయన నంద్యాలలో ప్రచారం చేయబోతున్నారు. దాదాపు 22 చోట్ల ఆయన రోడ్ షో ఉంటుందని ప్రకటించారు. బాలయ్య రాకతో పార్టీకి అన్నివిధాలుగా ఉపయోగపడుతుందని పార్టీ శ్రేణులు నమ్మకం పెట్టుకున్నాయి. కర్నూలు జిల్లాలో పార్టీలకు అతీతంగా బాలయ్యకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. వారిని ప్రభావితం చేయడానికి బాలయ్య రాక ఉపయోపడుతుందని అంచనా వేస్తున్నారు.
టీడీపీ బాలయ్యను రంగంలోకి దించుతుంటే… వైకాపా కూడా ధీటుగా స్పందిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, కృష్ణ అభిమానులు వైకాపా గెలుపునకు కృషి చేయాలంటూ ఆదిశేషగిరిరావు పిలుపునిచ్చారు. కృష్ణ అభిమాన సంఘం మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేదనీ, వైయస్సార్ మరణం తరువాత జగన్ కు మద్దతు ఇస్తోందని ఆయన చెప్పారు. కృష్ణతోపాటు మహేష్ బాబు అభిమానులు కూడా ప్రచారంలో పాల్గొనాలనీ, వైకాపాని గెలిపించాలని ఆయన కోరారు. కృష్ణ మహేష్ సేన వైకాపాకు పూర్తి మద్దతు ఇస్తోందనీ, ఇది నంద్యాల ఉప ఎన్నికతో ఆగేది కాదనీ… 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైకాపాకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేయడం విశేషం. కృష్ణకు అల్లుడైన గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా ఆదిశేషగిరిరావు ప్రస్థావించారు. గల్లా కుటుంబం రాజకీయాలకూ తమ రాజకీయాలకూ వ్యత్యాసం ఉందనీ, ఎవరి పని వారిదే అన్నట్టుగా చెప్పారు.
టీడీపీ తరఫున బాలయ్య రంగంలోకి దిగుతున్నారు. మహేష్ బాబు ఆశీస్సులు తమకే ఉన్నట్టు వైకాపా ప్రచారం మొదలుపెట్టింది. అయితే, నేరుగా మహేష్ బాబు ప్రచారానికి వచ్చేంత సీన్ ఉండదనే అనుకోవాలి! వైకాపాకి అనుకూలంగా ఆయన స్పందనను కూడా ఆశించలేం! ఇక, నంద్యాల ప్రచారంలో ఇంతవరకూ వైకాపాదే కాస్త పైచేయిగా కనిపిస్తూ వస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ ఇక్కడే ఉండి రోడ్ షో చేయడం, రోజా, అంబటి రాంబాబు వంటివారు మీడియా ముందు హడావుడి చేస్తూ వచ్చారు. దీనికి సరితూగేంతగా టీడీపీ హడావుడి చేయాల్సి ఉంది. ఒక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రమే తన వంతు కృషి చేస్తున్నారు. మిగతా నేతలూ నంద్యాలలోనే ఉన్నా.. వారంతా వ్యూహాల పనిలో ఉన్నారట! కాబట్టి, ఇప్పుడు బాలయ్య రాకతో ఆ లోటు భర్తీ అవుతుందన్నది టీడీపీ వర్గాల అంచనా.