డిజిటల్ ప్రొవెడర్లతో యుద్ధం ముగిసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ పిలుపు నిచ్చిన మేరకు మూతబడ్డ థియేటర్లు రేపటి నుంచి తెరచుకోబోతున్నాడు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా వెలువడింది. యూఎఫ్ ఓ, క్యూబ్ ఆపరేటర్లతో జరిపిన చర్చలు ఫలించాయి. అద్దెరేట్లను 22 శాతానికి తగ్గించడానికి ఆపరేటర్లు ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారమైంది. అయితే.. ఇది తాత్కాలిక ఒప్పందమే అని, త్వరలో పూర్తి స్థాయిలో మరోసారి చర్చలు జరుపుతామని డి. సురేష్‌బాబు తెలిపారు. ప్రస్తుత ఒప్పందం, కొత్త రేట్లు ఏప్రిల్ మొదటి వారం నుంచి అమలులోకి రాబోతున్నాయి. రేట్ల పట్టికను నిర్మాతలు, పంపిణీదారులందరికీ పంపుతున్నట్టు సురేష్‌బాబు తెలిపారు. కొత్త రేట్ల వల్ల చిన్న సినిమాలకు మేలు జరుగుతుందని, రెండోవారం, మూడోవారం, నాలుగోవారం ప్రదర్శించే చిన్న సినిమాలకు ఇది మరింత లాభదాయకంగా ఉంటుందని సురేష్‌బాబు చెప్పారు. యూఎఫ్ ఓ, క్యూబ్ సంస్థలు త్వరలోనే విలీనం కాబోతున్నాయి. అవి విలీనం అయ్యాక డిజిటల్ ఆపరేటర్లతో మరోదఫా చర్చలు జరుపడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అప్పుడు మరోసారి కొత్తగా ఒప్పందాలు చేసుకుంటామన్నారు సురేష్ బాబు. ”పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. ఒక్కొక్కటీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. రేపటి నుంచి థియేటర్లు తెరచుకోవొచ్చు”అని సురేష్ బాబు వ్యాఖ్యానించారు.