పేరుకి దక్షిణాది రాష్ట్రాల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ) థియేటర్ల బంద్. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బంద్ జరుగుతోంది. అదీ తెలుగు సినిమాల బంద్. మిగతా భాషల సినిమాలను దక్షిణాది రాష్ట్రాల థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఫేమస్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ ‘బుక్ మై షో’లో శుక్రవారం అంతా తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమలు నిరవధిక సమ్మె చేస్తున్న కారణంగా సినిమాలు విడుదల కావడం లేదని తెలిపారు. శుక్రవారం ఏ థియేటర్లోనూ టికెట్స్ ఓపెన్ కాలేదు. ఈ రోజు శనివారం హైదరాబాద్ థియేటర్లలో హిందీ సినిమాల టికెట్స్ ఓపెన్ అయ్యాయి. హిందీ సినిమా ప్రదర్శనలకు ఎటువంటి సమ్మె, బంద్ లేవు.
తెలుగులో తప్పిస్తే మిగతా దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో థియేటర్ల బంద్ వాతావరణం కనిపించడం లేదు. యధావిధిగా సినిమాలను ప్రదర్శిస్తున్నారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమ జేఏసీ ఐకమత్యం ఏమైందో? విచిత్రం ఏంటంటే… కర్ణాటక రాజధాని బెంగళూరులో తెలుగు సినిమాలనూ ప్రదర్శిస్తున్నారు. తొలిప్రేమ, అ!, ఛలో, భాగమతి, జై సింహాలను చూడాలనుకునేవారు అక్కడికి వెళ్ళి దర్జాగా టికెట్ కొని థియేటర్లలో చూడొచ్చు.
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్కు (క్యూబ్, వీఎఫ్ఓ) వ్యతిరేకంగా, వాళ్ళు వీపీఎఫ్ ఛార్జీలు తగ్గించే వరకూ తమ సినిమాలను ఇచ్చేది లేదని చెప్పిన తెలుగు నిర్మాతలు, బెంగళూరులో ప్రదర్శనకు ఏం చేస్తున్నారో? అక్కడ ఎలా ప్రదర్శిస్తున్నారో? చెబితే బాగుంటుంది. బంద్ మొదలైన ఒక్క రోజుకు తెలిసింది ఏంటంటే… తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాల ప్రదర్శనలు మాత్రమే ఆగాయి. పక్క రాష్ట్రాల్లో కాదు. తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమాలు విదలవుతున్నాయి. అలాగే… తమిళ, కన్నడ, మలయాళ రాష్ట్రాల్లో ఆయా భాషల సినిమాలను ప్రదర్శిస్తున్నారు.