సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఇటీవల మాజీ సివిల్ సర్వీస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు, ఇతర రంగాల ప్రముఖులు కలిసి ఓ వేదిక ఏర్పాటు చేసుకుని ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగంతో పాటు ప్రభుత్వాలను ప్రశ్నించడం, రాజకీయ చైతన్యం కల్పించడం లక్ష్యంగా ఈ వేదిక పని చేస్తోంది. ఇందులో పని చేస్తున్న వారిలో అత్యధికులు జగన్ రెడ్డి బాధితులే. వీరిలో కొంత మంది జగన్ రెడ్డి కి సన్నిహితులుగా మసులుకుని తర్వాత గెంటివేతకు గురయ్యారు.
స్థానిక ఎన్నికల విషయంలో జగన్ రెడ్డి వేధింపులకు గురైన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మొదట జగన్ చెప్పినట్లుగా చేసి చివరికి అగౌరవంగా పదవీ విరమణ పొందిన మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రాహ్మణ్యం, మాజీ ఐపీఎస్ అధికారి ఎంవీ కృష్ణారావు, జగన్ రెడ్డికి గతంలో బాకా ఊదీ ప్రభుత్వం వచ్చాక పదవి కూడా పొంది ఇటీవల జగన్ విమర్శలు చేస్తున్న జన చైతన్య వేదిక లక్ష్మణరెడ్డి వంటి వారితో ఈ వేదిక ఏర్పటాయిం. ఇంకా మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గ్రంధి భాస్కర్ రావు, జస్టిస్ జి.భవానీ ప్రసాద్, వంటి వారు కూడా ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ వేదిక ఏర్పాటు చేశామని… ఎవరికో మేలు చేయడానికో.. ఎవరిపైనో వ్యతిరేకత వ్యక్తం చేయడానికి కాదని మేధావులు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో తమ వేదిక ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్యాలు వివరించారు. ఈ ఆదివారం విజయవాడలో సభ ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యం బలహీనపడటానికి అంతర్గత శత్రువుల కారణం అని… ప్రజలు అందరూ చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వంలో ఉన్న అధికారులు గుమస్తా నుంచి సీఎస్ వరకూ చట్ట విరుద్ధ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మాజీ సీఈసీ వీఎస్ సంపత్ హాజరయ్యారు.