లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం ను అమల్లోకి తీసుకుని వస్తామని చెప్పిన బీజేపీ చివరికి ఆ విధంగానే చేసింది. ఈ చట్టంపై పిటీషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నా, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎన్ని నిరసనలు జరిగిన, ఎంత మంది, ఎన్ని పార్టీలు వ్యతిరేకించినా సీఏఏను సోమవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం సాయంత్రం జారీ చేసింది.
2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ-2019ను పార్లమెంటు ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. చట్టంలోని నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు లోక్‌సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకుని వస్తామని అమిత్ షాతో సహా అనేక మంది బీజేపీ నాయకులు ప్రకటిస్తూ వచ్చారు. ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం భారత పౌరసత్వాన్ని ఇస్తారు.
2014 డిసెంబరు 31 కంటే ముందు పై మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు మన దేశ పౌరసత్వం లభిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.కేరళ సహా 5 రాష్ట్రాలు ఈ చట్టాన్ని వ్యతిరేకించాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలను కూడా ఆమోదించారు.