మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలలో వివక్షకి గురై భారత్ తరలివస్తున్న హిందూ శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పించాలని భావిస్తోంది. అందుకోసం రాజ్యాంగం 1955 పౌరసత్వ చట్టాన్ని సవరించాలని భావిస్తోంది. భాజపా 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇది కూడా ఉంది. కనుకనే ఆ హామీని అమలుచేయడానికి చర్యలు చేపట్టింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ శరణార్ధులకు భారతీయ పౌరసత్వం మంజూరు చేసేంతవరకు దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేస్తోంది. ఆ వీసాలు పొందిన వారికి ఆధార కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లు మంజూరు చేయడానికి చర్యలు చేపడుతోంది. అంటే వారందరినీ భారతీయ పౌరసత్వం మంజూరు చేయడం లాంచనప్రాయమేనని అర్ధమవుతోంది. ఈ చట్ట సవరణ జరిగితే ఇప్పటికే దేశంలోకి వచ్చి ఉంటున్న సుమారు రెండు లక్షల మంది హిందు శరణార్ధులకు ప్రయోజనం చేకూరుతుంది. వారికి భారత పౌరసత్వం లభిస్తే, వారు కూడా దేశంలో కోట్లాది భారతీయులకు ఉండే అన్ని హక్కులు పొందగలుగుతారు. ప్రభుత్వ పధకాలకు అర్హులవుతారు. ముందుగా దీని కోసం ఒక ముసాయిదా బిల్లుని తయారు చేసి దానిని కేంద్రమంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు. ఆ తరువాత వచ్చే పార్లమెంటు సమావేశాలలో దీనికి సంబంధించి బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుతో బాటు 1920 పాస్ పోర్ట్ చట్టానికి కూడా సవరణలు చేయడానికి చర్యలు చేపడుతోంది. తద్వారా శరణార్ధులపై అక్రమ వలసదారులనే ముద్ర తొలగిపోతుంది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి తరలివస్తున్న లక్షలాది ముస్లింలను శరణార్ధులుగానే భావిస్తూ, వీలైతే వారిని వెనక్కి త్రిప్పి పంపేందుకు కూడా ప్రయత్నిస్తామని భాజపా నేతలు చెపుతుంటారు. మొన్న అసోం ఎన్నికలలో ఈ అక్రమవలసదారుల అంశమే ప్రధానాస్త్రంగా చేసుకొని భాజపా విజయం సాధించింది. రెండేళ్లలోగా బంగ్లాదేశ్ సరిహద్దులు పూర్తిగా మూసివేస్తామని హామీ ఇచ్చింది. భారత్ హిందూదేశం అయినప్పటికీ లౌకికవాద దేశంగా అన్ని మతస్థులను సమానంగా పరిగణిస్తుంది. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ముస్లిం శరణార్ధుల పట్ల ఒకవిధంగా, హిందూ శరణార్ధుల పట్ల మరొకవిధంగా వ్యవహరిస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు. మోడీ ప్రభుత్వం ఇది మానవతా దృక్పధంతో చేస్తున్నట్లు చెప్పుకొన్నప్పటికీ, భాజపా తన ‘హిందూ రక్షక’ బిరుదుని నిలుపుకొని, దేశంలో మెజార్టీ హిందువులను ఆకట్టుకోవడానికే చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించవచ్చు.