ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అధికారులు ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సాధారణ ఓ చిన్న ఉద్యోగికి.. తప్పు చేస్తే మెమో ఇస్తారు. దాని వల్ల అతను ఎదుర్కొనే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో.. అది అనుభవించిన వారికే తెలుస్తోంది. ఎవరి స్థాయిలో వారికి ఈ పనిష్మెంట్లు ఉంటాయి. ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు కాబట్టి.. తాము ఏం చేసినా చర్యలు తీసుకునేవారు ఉండరనుకుంటే… అది తాత్కాలికమే.. ఇప్పుడు కాకపోతే.. తర్వాతైనా వారి నిర్ణయాలు వారి మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఈ విషయంలో.. సివిల్ సర్వీస్ అధికారులకూ మినహాయింపు ఉండదు. ఏబీ వెంకటేశ్వరరావు, ప్రవీణ్ కుమార్ విషయంలో అదే జరుగుతోంది.
ఐఏఎస్ ప్రవీణ్‌ను ముంచేసిన సలహాదారు..!
ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మిషన్ బిల్డ్ డైరక్టర్ గా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. ఆయన ప్రధానంగా టూరిజం చూసుకుంటున్నారు. విశాఖ కలెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన ప్రభుత్వం మారిన తర్వాత బదిలీపై టూరిజంకు వచ్చారు. ఆ తర్వాత మిషన్ బిల్డ్ ఏపీ డైరక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఏదైనా నిక్కచ్చిగా చేస్తారన్న పేరున్న అధికారి ప్రవీణ్. అలాంటి అధికారి.. కోర్టు ధిక్కరణ కేసులో ఇరుక్కోపవడమే.. కాదు అత్యంత వివాదాస్పదం కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా విన్నాననిచెప్పడం.. న్యాయమూర్తి అనని మాటలను అన్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేయడం.. అంటే.. ఉన్నతాధికారులు సైతం నమ్మలేకపోతున్నారు. నమ్మడం లేదు కూడా. మిషన్ బిల్డ్ ఏపీ విషయంలో ప్రవీణ్ కుమార్ పేరుకు డైరక్టర్ కానీ.. ఆయన తరపున వ్యవహారాలు చక్కబెట్టే సలహాదారులెవరో.. అందరికీ తెలుసని ప్రభుత్వ వర్గాల్లోనే జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన నిర్వాకానికి ప్రవీణ్ కుమార్ బలి కావాల్సి వస్తోందన్న ఆవేదన అధికారవర్గాల్లో కనిపిస్తోంది.
ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ టు ప్రవీణ్..! బలివ్వడానికి ప్రభుత్వం సిద్ధమే..!
ప్రవీణ్ కుమార్ కెరీర్లో ఇదో రిమార్క్‌గా ఉండిపోతుంది. హైకోర్టుకు సారీ చెప్పినా క్షమించే అవకాశం ఉండకపోచవ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. అధికారవర్గాల్లో ప్రవీణ్ కుమార్ మొదటిగా ఇబ్బంది పడుతున్నారు కానీ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. జారీ చేసిన నిబంధనలకు విరుద్ధమైన జీవోలు.. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా.. చేసిన పనులు అధికారుల మెడకు చుట్టుకోవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి చర్యలు తీసుకునేది ప్రభుత్వమే కాబట్టి.. తీసుకునే చాన్స్ లేదు కాబట్టి.. తాము ఏం చేసినా చెల్లుతుందని కొంత మంది అధికారులు అనుకుంటున్నారు. కానీ పీకల మీదకు వస్తే.. ప్రభుత్వం అధికారుల్ని బలి పశువుల్ని చేయడానికి వెనుకాడనది ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ఉదంతమే సాక్ష్యంగా నిలుస్తోంది. ఇదే అధికారుల్ని సైతం.. ఆందోళనకు గురి చేస్తోంది.
తాత్కాలికంగా ప్రాధాన్య పోస్టింగ్.. శాశ్వతంగా తిప్పలు..!
గత ప్రభుత్వంలో అధికారులు కూడా.. కొంత మంది అత్యుత్సాహానికి పోయి చేసిన పనుల వల్ల ఇప్పుడు ఇబ్బందిపడుతున్నారు. ఏబీ వెంకటేశ్వరరావుపై కేసులు నమోదయ్యాయి. ఆయన తనపై కేసులు కక్ష సాధింపులే అని చెబుతూ ఉండవచ్చు కానీ.. ఆయనకు న్యాయం జరగడానికి చాలా కాలం పట్టే చాన్స్ కనిపిస్తోంది. ఈ లోపు ఆయన అతి కీలకమైన సర్వీసులు కోల్పోతున్నారు. ఆయనపై ప్రభుత్వమే కక్ష కట్టి ఉండవచ్చు..కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు చేస్తున్న తప్పులకు చట్టమే వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో పదుల సంఖ్యలో సివిల్ సర్వీస్ అధికారులు… నిబంధనలకు విరుద్ధమైన జీవోలు జారీ చేసి.. నిర్ణయాలు తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరందరికీ ప్రస్తుత ప్రభుత్వంలో తాత్కలికంగా ప్రాధాన్యం లభించవచ్చు. కానీ ఆ ప్రాధాన్యం వల్లనే.. వారితో తప్పులు చేయిస్తున్నారు.
గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోరా..?
సివిల్ సర్వీస్ అధికారులు అన్నింటికీ అతీతులు అనుకునే పరిస్థితి లేదు. వైఎస్ హయాంలో జరిగిన వాటికి ఎంత మంది సివిల్ సర్వీస్ అధికారులు మానసికంగా ఇబ్బందులు పడ్డారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాకుండా ఉండేలా చూసుకోవాల్సింది అధికారులే. ఎందుకంటే.. పోస్టింగ్ తాత్కాలికంగా..పోస్ట్ మాత్రమే శాశ్వతం. ప్రభుత్వాలు ఐదేళ్లకోసారి మారుతూంటారు. అధికారులు వాళ్లే ఉంటారు.