ఆంధ్రప్రదేశ్ అధికారవర్గంలో చిత్ర విచిత్రమైన మార్పులు … అంతకంటే అనూహ్యమైన ఉత్తర్వులు వెలువడుతున్నాయి. తాజాగా ఏపీ కేడర్ అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరుపై ఏటా ఇచ్చే నివేదికలను ఆమోదించే అధికారం ముఖ్యమంత్రి జగన్‌కు అప్పగిస్తూ… చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేసేశారు. అంటే ఇక నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పనితీరు నివేదికలు సీఎంకు అందజేస్తారు.అధికారుల పనితీరు, ప్రవర్తనను కూడా గ్రేడ్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఒక్క ఐఏఎస్‌కి మాత్రం మినహాయింపు ఇచ్చారు. గవర్నర్ కార్యదర్శిగా పని చేసే ఐఏఎస్‌కి మాత్రం గవర్నర్ నివేదిక ఆమోదిస్తారు. మిగతా అందరికీ సీఎం ఆమోదిస్తారు.
హఠాత్తుగా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి కారణం ఏమిటన్నదానిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఇలాంటి అధికారం కట్ట బెట్టడం వల్ల … సివిల్ సర్వీస్ అధికారులు ఇక కేంద్ర సర్వీసులకు వెళ్లాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ఏపీ నుంచి పెద్ద ఎత్తున సివిల్ సర్వీస్ అధికారులు ఢిల్లీ సర్వీస్ కోసం… దరఖాస్తులు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో సీఎస్ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడంపై… ఓ వర్గం అధికారుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ఏపీ నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా నిరోధించడంతో పాటు… చెప్పిన పనిచేయని అధికారులను డిగ్రేడ్ చేయడానికి ఈ ఉత్తర్వులు ఉపయోగపడతాయని అంటున్నారు.
నిజానికి ప్రస్తుత ప్రభుత్వంలో నిబంధనలకు అనుగుణంగా కన్నా… ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయడమే పెద్ద టాస్క్‌గా మారింది. పెద్ద ఎత్తున కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తమ శాఖలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడానికి సంకోచిస్తున్నారు. వీరందరి పనితీరును సీఎం మదింపు చేయడం అంటే.. చెప్పిన పనిచేయని వారికి హెచ్చరిక లాంటిది పంపడమే. ఇది మరింత ప్రమాదకరమన్న అభిప్రాయాలు అధికారవర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఐపీఎస్ అధికారులు..తనపై తప్పుడు కేసు పెట్టాడనికి నేరపూరిత చర్యలకు పాల్పడ్డారని ఏబీవీ వెంకటేశ్వరరావు సీఎస్‌కు ఫిర్యాదు చేసిన కొన్నిగంటల్లోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. అందుకే.. వీటిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆ ఉత్తర్వులు పనిచేస్తాయో లేదో.. డీవోపీటీ తేల్చేస్తుంది.