తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని… రెండేళ్ల నుంచి ఉన్న డిమాండ్‌కు.. విజ్ఞప్తులకు.. ఎట్టకేలకు సీజేఐ ఎన్వీ రమణ .. మోక్షం కల్పించారు. న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచుతూ వచ్చిన ప్రతిపాదనకు ఆమోదముద్రవేశారు. దీంతో.. తెలంగాణ న్యాయవాదుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఒక్క న్యాయవాదుల్లో మాత్రమే కాదు.. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని … హైకోర్టును విభజించినప్పటి నుండి… అన్ని పార్టీల నేతలూ కోరుతున్నారు. సీఎం కేసీఆర్ ఈ అంశంపై చాలా సార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా లేఖలు రాశారు.
విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నియామకానికి అనుమతించారు. అయితే పేరుకు 24 మందే కానీ.. ఎప్పుడూ పూర్తి స్థాయిలో న్యాయమూర్తుల నియామకం జరగలేదు. ఇప్పుడు కూడా.. 24 మంది న్యాయమూర్తులు లేరు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోందని, ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే జడ్జిల సంఖ్యను పెంచాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు.. అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటూ వచ్చాయి. కారణం ఏమైనా కానీ రెండేళ్ల పాటు… ఆ విజ్ఞప్తి పెండింగ్‌లోనే ఉండిపోయింది.
ఇటీవల.. చీఫ్ జస్టిస్‌లతో .. సీజేఐ రమణ.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు… అన్ని హైకోర్టులో సీజేఐలు తమ సమస్యలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్.. న్యాయమూర్తుల కొరత గురించి.. పేరుకుపోతున్న పెండింగ్ కేసుల గురించి… న్యాయమూర్తులను పెంచాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. అన్ని హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల విజ్ఞప్తుల్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి పరిష్కరిస్తున్న సీజేఐ.. తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తుల సంఖ్యను పెంచారు. ఫుల్ బెంచ్‌ను ఎప్పుడూ భర్తీ చేయకపోయినా… ఈ నిర్ణయం వల్ల.. న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతుందని.. తెలంగాణ న్యాయ సమాజం సంతృప్తి వ్యక్తం చేస్తోంది.