న్యాయవ్యవస్థను కించ పరుస్తూ అదే పనిగా అభాండాలు వేస్తున్న వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని సీజేఐ ఎన్వీరమణ స్పష్టం చేశారు. తెలంగాణలో జిల్లా కోర్టుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన తన ప్రసంగంలో కోర్టులపై నిందలు వేస్తున్న వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేయడం తేలికైందన్నారు. కొందరు తీర్పులకు కూడా వక్రభాష్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేసి పైశాచిక ఆనందం పొందే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. పరిధులు దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ విషయాన్ని వాళ్లు గుర్తుపెట్టుకోవాని ఓ రకంగా హెచ్చరికలుగా సీజేఐ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ కొందరు స్వార్థపరుల కోసం కాదని, న్యాయవ్యవస్థ ప్రజల హక్కు అని సీజేఐ పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో న్యాయవ్యవస్థపై- నిందలు వేయడం ఓ జాడ్యంలా మారిపోయింది. తప్పుడు కేసులతో ఓ సీఎం ఏకంగా కాబోయే చీఫ్ జస్టిస్‌పై నిందలు వేసి.. అప్పటికీ సీజేఐకి లేఖ రాయడమే కాకుండా తప్పుడుపని అని తెలిసినా మీడియాకు విడుదల చేశారు. అప్పట్నుంచి దేశంలో న్యాయవ్యవస్థపై దాడి అంతకంతకూ పెరిగిపోతోంది. ఇటీవల కేరళ హైకోర్టును ఉద్దేశించి అక్కడి రాజకీయ పార్టీల నేతలు కొంత మంది అందరూ బీజేపీ మద్దతు దారులేనన్నట్లుగా మాట్లాడారు. బెంగాల్లోనూ అధికార తృణమూల్ పార్టీ నేతలు అదే తరహాలో విమర్శలు చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సీజేఐ ఈ వ్యాఖ్యలు చేసిట్లుగా తెలుస్తోంది.
అయితే న్యాయవ్యవస్థపై నిందలేసి.. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో న్యాయవ్యవస్థ కూడా పెద్దగా సఫలం కావడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే నిందలు వేసే వారు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఏపీలో ఓ పథకం ప్రకారం జరిగిన దాడిలో .. ఇప్పటికీ ఎవర్నీ శిక్షించలేకపోయారు. చాలా మందిని కనీసం అదుపులోకి తీసుకోలేకపోయారు. సీబీఐ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలు కూడా చేతులెత్తేశాయి. ఈ పరిణామాలతో హెచ్చరికలు కాకుండా శిక్షించగలిగితేనే వ్యవస్థపై నిందలేసే వాళ్లలో భయం పెరుగుతుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.