సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదవీ విరమణ చేసే ఒక్క రోజు ముందు తెలుగు జర్నలిస్టులు పన్నెండు వందల మందికి గుడ్ న్యూస్ చెప్పారు సీజేఐ ఎన్వీ రమణ. పన్నెండేళ్లుగా నలుగుతున్న హౌసింగ్ సొసైటీ భూ వివాదాన్ని పరిష్కరించేశారు. ఆ స్థలాలను జర్నలిస్టులకు ఇవ్వాలని వారు ఇళ్లు కూడా కట్టుకోవచ్చని తీర్పు ఇచ్చారు. వైఎస్ హయాంలో పన్నెండేళ్ల కిందట జర్నలిస్టులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, జడ్జిలకు భూములు కేటాయించారు. అయితే ఆ భూములు వివాదంలో ఉన్నాయి. దీంతో న్యాయమూర్తులు తమకు ఆ భూములు వద్దని అప్పుడే చెప్పేశారు. మిగిలిన వాటి కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయి.
అప్పట్లో కేంద్రంలో.. ఉమ్మడి ఏపీలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలు కాబట్టి..జర్నలిస్టులు జవహార్‌లాల్ నెహ్రూ హౌజింగ్ సొసైటీ పేరుతో సొసైటీగా ఏర్పడ్డారు. వారికే స్థలాలను కేటాయించారు. హైదరాబాద్‌కు చెందిన 1200 మంది జర్నలిస్టుల వరకు 13 కోట్లు ప్రభుత్వానికి కట్టారు. ఒక్కొక్కరు రెండు లక్షల వరకూ చెల్లించారు. మొత్తం 70 ఎకరాలు కేటాయించారు. అయితే వాటిలో 30 ఎకరాలు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి ఇచ్చారు. కోర్టుల్లో కేసులు తేలకపోవడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర చోట్ల స్థలాలు కేటాయించాలనే ప్రయత్నం చేశారు. డబుల్ బెడ్ రూం లు కట్టిస్తామని చెప్పారు. హైదరాబాద్ శివారులో ఓ స్థలాన్ని చూసి రమ్మని జర్నలిస్టు నేతలకు కూడా చెప్పారు. అయితే తర్వాత ముందుకు సాగలేదు.
రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నామని తీర్పు సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నాంమని సీజేఐ ఎన్వీ రమణ ప్రకటించారు. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చునన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయమని రిజిస్ట్రీని ఆదేశించారు. జర్నలిస్టులు హౌసింగ్ సొసైటీకి డబ్బులు కట్టి సుదీర్ఘ కాలంగా వడ్డీలు కట్టుకుంటున్నారు. ఇప్పుడు అవి అత్యంత విలువైన స్థలాలు కావడంతో ఆ సొసైటీలో ఉన్న వారికి జాక్ పాట్ తగిలినట్లే అనుకోవచ్చు.