భారత ప్రధాన న్యాయమూర్తి (సి.జె.ఐ.) టి.ఎస్.టాకూర్ ని నిన్న తెలంగాణా న్యాయవాదులు కలిసి తమ సమస్యలన్నీ వివరించినపుడు ఆయన చాలా సమయోచితంగా స్పందించారు.
“న్యాయాధికారుల నియామకం, సస్పెన్షన్ వంటివన్నీ పరిష్కరించగలిగే సమస్యలే. వాటి కోసం న్యాయవ్యవస్థని అందులో పనిచేస్తున్నవాళ్ళే రోడ్డున పడేయడం సరికాదు. కనుక ముందు మీరు సమ్మె విరమించి తక్షణమే విధులలో చేరితే, హైకోర్టు విభజనతో సహా అన్ని నేను పరిష్కరిస్తాను,” అని చెప్పారని నిన్న ఆయనని డిల్లీలో కలిసిన తెలంగాణా న్యాదికారులు సంఘాల నేతలు చెప్పారు. హైదరాబాద్ వెళ్లి ఆయన సూచనపై చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదనే చెప్పవచ్చు. కనుక వారు కూడా ఆయనపై నమ్మకం, గౌరవం ఉంచి సమ్మె విరమించే అవకాశాలున్నాయి.
ఆయన వారితో గంటకి పైగా మాట్లాడారు. సమ్మె విరమించి మళ్ళీ విధులలో చేరినట్లయితే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్.బి.భోసలే తో మాట్లాడి న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్ని నిలిపివేయిస్తానని హామీ ఇచ్చారు. కానీ వారు కూడా ఆయనకి క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే హైకోర్టు ప్రాధమిక కేటాయింపులపై కూడా మాట్లాడుతానని హామీ ఇచ్చారు. హైకోర్టు విభజన కోసం చట్ట సవరణ చేయాలా లేకపోతే ఆంధ్రాలో తాత్కాలిక హైకోర్టుని ఏర్పాటు చేయాలా అనే విషయంపై కేంద్ర న్యాయశాఖ మంత్రితో, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడి వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
భారత ప్రధాన న్యాయమూర్తి స్వయంగా పూనుకొంటే ఈ సమస్యని పరిష్కరించడం పెద్ద కష్టమేమీ కాదు. ఎవరూ ఆయన మాటని కాదనలేరు కనుక సమ్మె చేస్తున్న తెలంగాణా న్యాయవాదులు కూడా ఆయన మాటకి గౌరవమిచ్చి, ఆయన మాటపై నమ్మకం ఉంచి తక్షణమే సమ్మె విరమించి విధులలో చేరడం చాలా మంచిది. రాజకీయ నాయకులని నమ్ముకొని ఇంకా సమ్మె కొనసాగిస్తే వారు ఆశించిన ప్రయోజనం నెరవేరదు పైగా చివరికి వారే నష్టపోయే ప్రమాదం ఉంది.