తెలంగాణ సీఎం కేసీఆర్కు మైహోం రామేశ్వరరావు కూడా దూరమైనట్లుగా కనిపిస్తోంది. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవంలో ఆయన కనిపించలేదు. కానీ ఎస్ఈడబ్యూ ఇన్ ఫ్రా కంపెనీ ఓనర్ అయిన సీఎల్ రాజాం కనిపించారు. ఆయన కేసీఆర్ పక్కన కనిపించడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో రామేశ్వరరావు ప్లేస్ రాజాంకు ఇచ్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎల్ రాజం కేసీఆర్కు సన్నిహితునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక ను ఆయనే స్థాపించారు.
టీ న్యూస్ కూడా ఆయనదే. చాలా కాలం సీఎండీగా కొనసాగారు. సీఎం రాజంను కేసీఆర్ రాజ్యసభకు పంపుతారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ రాజాం నుంచి టీవీ, పత్రికలను కేసీఆర్ లాగేసుకున్నారు. దామోదర్ రావు చేతిలో పెట్టారు. తర్వాత రాజం మరో ఇంగ్లిష్ పేపర్ పెట్టే ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేదు. కేసీఆర్కు కూడా దూరమయ్యారు. ఆయన బీజేపీలో చేరారు. దీంతో కేసీఆర్కు, రాజంకు మాటలు లేకుండా పోయాయి. అయితే హఠాత్తుగా యాదాద్రి పున:ప్రారంభం సందర్భంగా సీఎల్ రాజం కేసీఆర్తో పాటు కనిపించారు.
త్వరలో యాదాద్రి తరహాలోనే వేములవాడ ఆలయం పునర్నిర్మాణాన్ని చేపట్టాలనుకుంటున్న కేసీఆర్ ఆ బాధ్యతను సీఎం రాజంకు అప్పగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నమస్తే తెలంగాణలోనే విషయాన్ని నేరుగా చెప్పడంతో సీఆర్తో రాజంకు మధ్య విభేదాలు తొలగిపోయాయనే చర్చ సాగుతుంది. అంటే.. కేసీఆర్ రాజగురువుతో పాటు శిష్యుడ్ని కూడా మార్చేస్తున్నారన్నమాట.