ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం లేదా ఒంటరిగా పోటీ చేసేలా జనసేనను ఒప్పించేందుకు కేసీఆర్ జనసేనకు రూ. వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రకటించడం సంచలనం అయింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. రెండు పార్టీలు ఏపీ, తెలంగాణలో కలిసి పోటీ చేస్తాయన్నట్లుగా కొంత మంది ప్రచారం చేసేస్తున్నారు. జనసేన అభిమానులు… ఇతర పార్టీలపై వేమూరి రాధాకృష్ణపై విమర్శలు చేస్తున్నారు. కానీ కేసీఆరే కేవలం ప్రతిపాదనలు పంపారు కానీ.. వాటిని పవన్ యాక్సెప్ట్ చేశారని ఆర్కే చెప్పలేదు. కనీసం పవన్ స్పందన ఎలా ఉందన్నది కూడా చెప్పలేదు.
పవన్ కల్యాణ్.. స్వచ్చ రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల్లో డబ్బులు పంచడానికి ఆయన వ్యతిరేకం. గత ఎన్నికల్లో డబ్బులు పంచని పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన మాత్రమే. ఇప్పుడు ఆయన తన స్టాండ్ మార్చుకుంటారని జనసైనికులు అనుకోవడం లేదు. కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ప్రకారం చూస్తే నియోజకవర్గానికి రూ. ముఫ్పై కోట్ల రూపాయలు పంచి.. ముఫ్పై నియోజకవర్గాల్లో గెలుపు కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. అలాంటి వాటికి పవన్ అంగీకరిస్తారని.. కేసీఆర్ ఆఫర్ కు అంగీకరిస్తారని జనసైనికులు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ అనుకోవడం లేదు.
పైగా బీఆర్ఎస్తో కలిసి పని చేయడం అంటే.. ఏపీలో పవన్ కల్యాణ్ తనకు ఉన్న మద్దతును కూడా కోల్పోవడమేనన్న చర్చ ఉంది. బీఆర్ఎస్ ముద్ర లేకుండా పోటీ చేస్తే ఆరేడు శాతం ఓట్లు వచ్చాయి… అదే బీఆర్ఎస్ ముద్రతో పోటీ చేస్తే సగానికి సగం పడిపోతాయని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ నిజంగానే అలాంటి ప్రతిపాదనలు పవన్ కల్యాణ్ వద్దకు పంపి ఉంటే.. అందులో ఉన్న అసలు విషయాన్ని పవన్ కల్యాణ్ గ్రహించి ఉంటారని అంటున్నారు.
మొత్తానికి ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే రూ. వేయి కోట్ల ప్యాకేజీ విషయాన్ని బయట పెట్టినప్పటి నుండి ఏపీ రాజకీయాల్లో గగ్గోలు ప్రారంభమయింది.