అరవింద సమేత వీరరాఘవ… సినిమా సక్సెస్ మీట్… నందమూరి కుటుంబ సమేత… అన్న ఇమేజ్ తీసుకొచ్చింది. ఎక్కడా.. రాజకీయాల జోలికి పోకుండా.. తమ మధ్య ఇప్పటి వరకూ ఎలాంటి గ్యాప్ లేదన్నంతగా.. నందమూరి బాబాయ్ అబ్బాయిలు కలసిపోయారు. అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు… సినిమా కోసం పని చేసిన వారినందర్నీ… నందమూరి బాలకృష్ణ మనస్ఫూర్తిగా అభినందించారు. బాలకృష్ణ శిల్పాకళా వేదికలోకి అడుగు పెట్టినప్పటి నుంచి అబ్బాయిలతో బాబాయ్ కులాసాగా మాట్లాడుతూ కనిపించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. వారి మధ్య ఎలాంటి అరమరికల్లేవన్న విషయాన్ని మాత్రం… స్పష్టంగా అభిమానుల ముందు ఉంచారు.
నందమూరి అభిమానుల్లో … చాలా కాలంగా.. ఓ గందరగోళం ఉంది. ఆ కుటుంబంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. చాలా కాలంగా ఒకే వేదికపై కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే.. కుటుంబ ఫంక్షన్లలోనూ కలిసింది లేదు. బాలకృష్ణే అలా ఉన్నారు కాబట్టి.. ఇక లోకేష్, చంద్రబాబు వేరేగా ఉండే అవకాశం లేదు. దానికి తగ్గట్లుగా ఎన్టీఆర్ కూడా అలాగే ఉన్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేసిన ఎన్టీఆర్ 2014లో దూరంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మాత్రం కుటుంబంతో సహా హాజరయ్యారు. అయితే.. ఆ తర్వాత కూడా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడలేదు.
కానీ అరవింద సమేత సినిమా సక్సెస్‌మీట్ తో మాత్రం.. ఉన్న గ్యాప్ పూర్తిగా పోయినట్లుగానే అభిమానులు భావిస్తున్నారు. అటు కుటుంబ పరంగా.. ఇటు రాజకీయంగా కూడా అందరూ కలసిపోతారని.. అభిమానులు ఆశిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను.. రాజకీయంగా మళ్లీ దగ్గరకు తీసుకునే అవకాశాలను ఎవరూ కొట్టి పారేయడం లేదు. అలా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కట్టె కాలే వరకూ.. తనది తెలుగుదేశం పార్టీనేనని ఎన్టీఆర్ పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం ఇక రాకపోవచ్చు. మొత్తానికి అరవింద సమేత… సినిమా ఎన్టీఆర్ కు ఓ భారీ సక్సెస్ మాత్రమే కాదు.. అంతకు మించి… విలువైన కుటుంబ బంధుత్వాలను కలిపింది.